తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కొనియాడారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వారికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో నిర్వహించిన 'స్టాండ్ విత్ హర్' కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ మహిళా సాధికారతపై సీఎం రేవంత్ మాట్లాడారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని చెప్పారు. ఆయా చట్టాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత పూర్తిగా నెరవేరుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో మహిళల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తిమేర పదవులను కట్టబెట్టామని చెప్పారు. దాంతో పాటుగా ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. దాంతో పాటుగా.. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులను నడిపిస్తున్నామని వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చటమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ వంటి ఖరీదైన ప్రాంతం పక్కనే మహిళా ఉత్పత్తుల విక్రయం కోసం ఇందిరా మహిళా స్టాల్స్‌కు స్థలం కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ మహిళల ప్రతిభను యావత్ ప్రపంచానికి పరిచయం చేయటానికి వారు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయించేలా ప్రత్యేకంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.