తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను ప్రకటించింది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను ఈ పురష్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ చిత్రాలు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణలకు ఈ అవార్డులు ప్రకటించింది. ఇందులో అక్కినేని నాగ చైతన్య బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యారు. దీనిపై ఆయన తండ్రి తాజాగా స్పందించారు. ‘తండేల్’ చిత్రంలో కనబరిచిన అద్భుతమైన నటనకుగాను నాగ చైతన్యకు 'ఉత్తమ నటుడు' క్యాటగిరీలో గద్దర్ అవార్డు వరించింది. ఇది చైతూ కెరీర్ లో రెండో స్టేట్ అవార్డ్. ఇంతకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 'మనం' సినిమాకి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డుకు ఎంపికయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ యాక్టర్ గా గద్దర్ అవార్డ్ దక్కింది. కుమారుడు ప్రతిష్టాత్మక పురష్కారానికి ఎంపికైనందుకు నాగార్జున సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.''2025 గద్దర్ అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. నా తండ్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు గారి పేరు మీదుగా 'ANR అవార్డ్'ను ప్రారంభించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నిజంగా ఆయనకు తగిన నివాళి. దీనికి అర్హురాలైన జయసుధ గారికి ఈ అవార్డు లభించినందుకు సంతోషిస్తున్నాను. 'ఎన్టీఆర్ అవార్డ్' అందుకున్న చిరంజీవిగారికి మెగా కంగ్రాట్స్. నా కుమారుడు నాగ చైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు గర్వపడుతున్నాను. 'తండేల్' సినిమాలో అతని అద్భుతమైన ప్రదర్శన ఈ పురష్కారానికి అర్హమైనది. దుళ్ల కొట్టావ్ నాన్న'' అని నాగార్జున ఎక్స్ లో పేర్కొన్నారు.