పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మరోవైపు కర్ణాటకలో 16 ఏళ్లలోపు వారు సోషల్‌ మీడియా వాడకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలా ఒకేసారి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంపై టాలీవుడ్ హీరో స్పందించారు."13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నియంత్రించేలా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి చొరవ తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించిన కర్ణాటక ప్రభుత్వానికి, సిద్ధరామయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇది చాలా ప్రశంసనీయం. యువత ఆలోచనా దృక్పథాన్ని రక్షించే దిశగా సరైన సమయంలో తీసుకున్న ఆలోచనాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను''''ఒక తండ్రిగా, అలాగే పిల్లలకు సంబంధించిన రంగంలో పని చేసే వ్యక్తిగా.. నేటి తరం పిల్లల్లో దూకుడు స్వభావం, తప్పుడు సమాచారం, వ్యసనపరులుగా మారే ప్రవర్తనలు ఎలా నెమ్మదిగా అలవాటుగా మారిపోతున్నాయో నేను స్వయంగా గమనిస్తున్నాను. పిల్లలు ఎదుగుతున్న కీలకమైన దశలో వారిని సంరక్షించడం మనందరి ఉమ్మడి బాధ్యత. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు ఇలాంటి రక్షణ చర్యలతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నాను" అని మంచు మనోజ్ ఎక్స్ లో పేర్కొన్నారు.