: అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో పలు కంపెనీలు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌పైనా విపరీతంగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సమయంలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. . తర్వాత టెక్ సంస్థలు ఒరాకిల్ సహా మరికొన్ని కంపెనీలు ఇదే బాటలో పయనించాయి. ఇటీవల జాక్ డోర్సేకు చెందిన బ్లాక్ సంస్థ కూడా సుమారు 40 శాతం మంది వరకు ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు ప్రముఖ ఇ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా లేఆఫ్స్ ప్రకటించింది. ఈ మేరకు పలు ఆంగ్ల వార్తా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. >> వార్షిక పనితీరు మదింపు చేసి పెర్ఫామెన్స్ బాగోలేదన్న కారణంతో వందల మందిని ఉద్యోగుల్ని తొలగించింది ఫ్లిప్‌కార్ట్. ఈ సంఖ్య కచ్చితంగా తెలియకపోయినప్పటికీ.. సుమారు 500 మంది వరకు ఉద్యోగులు ఉంటారని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. పలు విభాగాల్లో.. ఉద్యోగి స్థాయిని బట్టి లేఆఫ్స్ ఉన్నట్లు తెలిసింది. అయితే ఇదే సమయంలో పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు చేస్తున్న ఫ్లిప్‌కార్ట్.. మరోవైపు సీనియర్ స్థాయిల్లో ఉద్యోగుల్ని నియమించుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోవైపు ఫ్లిప్‌కార్ట్ లేఆఫ్స్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎప్పటికప్పుడు ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంటామని.. ఇందులో భాగంగానే తాజాగా కొద్ది సంఖ్యలో ఉద్యోగుల్ని పక్కనబెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. నిర్దేశిత లక్ష్యాల్ని చేరుకోని వారిని తొలగించినట్లు పేర్కొంది. బాధిత ఉద్యోగులకు వేరే ఉద్యోగ అన్వేషణలో తమ వంతు సహకారం ఉంటుందని తెలిపింది. గతంలో 2023లో 1000- 1200 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించగా.. 2024లో సుమారు 5-7 శాతం వరకు ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు.. కంపెనీ మొత్తం వర్క్ ఫోర్స్‌లో సుమారు 3-4 వరకు తొలగించినట్లు సమాచారం.ఐపీఓకు సన్నాహాలు..వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ఐపీఓకు వచ్చేందుకు ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే సింగపూర్‌లో ఉన్నటువంటి తమ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కు తరలించింది. భారత నియంత్రణ సంస్థల మార్గదర్శకాలు, అవసరాలకు అనుగుణంగా తమ హోల్డింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ లీడర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు కొద్ది నెలలుగా నియామకాల్ని చేపట్టింది. ఇక ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 5,189 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించింది. ఆదాయం మాత్రం రూ. 82,787.3 కోట్లుగా ప్రకటించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్ సంస్థలో ఫ్లిప్‌కార్ట్, మింత్రా సహా ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్, క్లియర్ ట్రిప్, సూపర్.మనీ కంపెనీలు వంటివి ఉన్నాయి.