తిరుమల కల్తీ నెయ్యి కేసు.. డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ

Wait 5 sec.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన డెయిరీ నిపుణుడు విజయ భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విజయ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కల్తీ ఉదంతం వెనుక ఉన్న లోతైన కుట్రను ఛేదించేందుకు సిట్ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపాలని హైకోర్టు ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల లడ్డూ కేసులో విజయ భాస్కర్ రెడ్డి ఏ34 నిందితుడిగా ఉన్నారు. కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాకు సంబంధించి అర్హత లేని డెయిరీలకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. వాటి ద్వారా ఆయన భారీగా లబ్ధి పొందారని సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో సైతం దాఖలు చేశారు. ఆల్ఫా డెయిరీ ప్రతినిధుల నుంచి 8 గ్రాముల గోల్డ్‌ కాయిన్‌, ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే డెయిరీ ఎండీ జగ్‌మోహన్‌ గుప్తా నుంచి రూ.2.50 లక్షలు, మాల్‌గంగా, వైష్ణవి, భోలేబాబా, ప్రీమియర్‌ ఫుడ్స్‌ తదితర డెయిరీల నుంచి హైదరాబాద్‌లోని హవాలా ఏజంట్‌ ద్వారా మొత్తంగా రూ.83 లక్షలు విజయ భాస్కర్ రెడ్డి లంచంగా తీసుకున్నారని సిట్ తన విచారణలో గుర్తించింది. ఈ మేరకు కేసు కూడా నమోదు చేసింది.దీంతో తనను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో విజయ భాస్కర్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. హవాలాతో పాటు వివిధ మార్గాల ద్వారా మొత్తం రూ.83 లక్షలు విజయభాస్కర్ రెడ్డికి అందాయని సిట్ తరపు న్యాయవాదాలు కోర్టుకు వివరించారు. దీంతో విజయభాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణకు సహకరించాలని పిటిషనర్‌‌ను ఆదేశించింది. తాజా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసులో తదుపరి పరిణామాలు మరింత వేగవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.