హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్‌కు సంబంధించిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ శనివారం (మార్చి 7) సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు జారీ చేశారు. క్యూర్ పరిధిలో ప్రతీరోజు ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని చెప్పారు. పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ.. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ప్రాంతం చొప్పున కేటాయించి మూడు కార్పొరేషన్ల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.నిర్మాణ రంగంలో వ్యర్థాలు పెను సవాలుగా మారుతున్నాయని.. ఆ వ్యర్థులకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంపింగ్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా, అలాగే ప్రతినిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడం, దోమల నివారణ, సీజనల్ వ్యాధుల విషయంలో నగర వాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.