ఏపీలో 4 బ్యాంకులు విలీనం.. 5 రోజులు బ్యాంక్ సేవలు బంద్.. కస్టమర్లకు అలర్ట్

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట.. నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకే దేశం- ఒకే ఆర్ఆర్‌బీ కింద దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్ని ఏకీకరించి.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గ్రామీణ బ్యాంకే ఉండేలా విలీనం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఇవన్నీ.. ఒకే సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. దీంతో ఇక పాత బ్యాంకులు కనిపించవని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ విలీన ప్రక్రియకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఒక సర్క్యులర్ విడుదల చేసింది.4 గ్రామీణ బ్యాంకుల్ని సాంకేతికంగా విలీనం చేసే ప్రక్రియలో భాగంగా.. ఈ బ్యాంకింగ్ సేవలు చాలా వరకు సుమారు 5 రోజుల పాటు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. 'ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుల్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో సాంకేతికంగా విలీనం చేయనున్న నేపథ్యంలో.. అక్టోబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి.. అక్టోబర్ 13 ఉదయం 10 గంటల వరకు.. మా పూర్వ బ్యాంకుల సేవలు (ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు) తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.' అని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. >> ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్‌లతో పాటు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఏటీఎం సేవలు, బ్యాంక్ మిత్రలు కూడా అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది. అంటే 5 రోజుల పాటు పూర్తిగా ఈ గ్రామీణ బ్యాంకుల సేవలు పొందలేరని చెప్పొచ్చు. మరి అక్టోబర్ 13 వ తేదీ తర్వాత.. ఆయా గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా విలువైన తమ ఖాతాదారులకు ఈ సందర్భంలో కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది బ్యాంకు. ఈ సమయంలో ఆర్థికపర బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ లావాదేవీలకు అంతరాయం కలుగుతున్నందున మీ ఆర్థిక లావాదేవీల్ని తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకోవాల్సిందిగా ఖాతాదారులకు అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 9 సాయంత్రం 6 గంటలలోపు సేవలు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. విలీనంతో బ్యాంకులు.. కస్టమర్లకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తాయని కేంద్రం భావిస్తోంది.