ఆ రోడ్లకు మహర్దశ.. 2 లైన్లు, 4 లైన్లకు గ్రీన్‌సిగ్నల్.. క్లియర్ కట్ ప్లానింగ్ అంటే ఇదే..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోని రోడ్డు, భవనాల శాఖ రహదారులకు మహర్దశ పట్టనుంది. ముఖ్యంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానాన్ని అనుసరించి.. రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్ర రహదారులను అద్దంలా మార్చాలని ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రహదారి నిర్మాణాలు దేశానికే ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. రోడ్డు నిర్మాణాలపై కీలక సమావేశం.. గురువారం నాడు సచివాలయంలో ఈ నిర్మాణ ప్రణాళికలపై కీలకమైన అధికారిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్అండ్ బీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యవేక్షణలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి హరిత, ఆర్ అండ్ బి విభాగంలోని ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హ్యామ్ విధానానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులకు వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశలవారీగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా ట్రాఫిక్ సర్వే నిర్వహించి.. అత్యధిక రద్దీ ఉన్న రహదారులను గుర్తించి వాటి విస్తరణకు.. పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సమ ప్రాతినిధ్యం దక్కేలా ప్రాధాన్యతా జాబితాను తయారు చేయాలన్నారు. హ్యామ్ విధానంలో ప్రమాద రహిత రోడ్లు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హ్యామ్ ద్వారా నిర్మించే రోడ్లు దేశంలోనే నంబర్ వన్ గా నిలవాలని ఆకాంక్షించారు. తమ శాఖ ప్రధానంగా ప్రమాదాలు లేని రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టిందని తెలిపారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లు జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం పటిష్ట సంకల్పంతో ఉందని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య మెరుగైన అనుసంధానం (Connectivity) కోసం ఈ హ్యామ్ రోడ్లను కారిడార్లుగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. ఆర్ అండ్ బీ శాఖ తయారు చేసిన సమగ్ర ప్రణాళికల ప్రకారం.. మొదటి దశలో మొత్తం 5,587 కిలోమీటర్ల రహదారుల పునరుద్ధరణ చేపట్టనున్నారు. దీనికి రూ.10,986 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రూ.4,416 కోట్ల ఖర్చుతో 3,792 కిలోమీటర్ల మేర సింగిల్, డబుల్, ఫోర్ లేన్ రోడ్ల బలోపేతం చేయనున్నారు.1,795 కిలోమీటర్ల రహదారుల విస్తరణకు రూ.6,569 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తక్షణమే హ్యామ్ రోడ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి.. పనుల కేటాయింపు మొదలు పెట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల వివరాలను కూడా మంత్రి సమీక్షించారు. ఈ రోడ్లను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేయనున్నారు.