జీవో నంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే.. ఎన్నికలు జరిగేనా..?

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌పై వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు తమ వాదనలో ప్రభుత్వ జీవో ద్వారా ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరుగుతోందని.. కొన్ని వర్గాలకు అనుకూలంగా మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు, జీవో 09 అమలుపై Stay విధించింది. అంతే కాకుండా.. ఈ రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్‌పై కూడా స్టే విధించింది హైకోర్టు. కోర్టు తన ఆదేశాల్లో.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల వ్యవధిలో సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. మరోవైపు.. పిటిషనర్లకు కూడా రెండు వారాల్లో తమ వాదనలకు సంబంధించిన సాక్ష్యాలు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై అస్పష్టత నెలకొంది. ఎన్నికల కమిషన్ అధికారులు కోర్టు ఆర్డర్ కాపీ అందిన తరువాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో గ్రామ, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ తీర్పుతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు ముదిరాయి. కొందరు దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణగా చూస్తుండగా.. మరికొందరు ప్రభుత్వ విధానాలపై కోర్టు జోక్యాన్ని సవాలు చేస్తున్నారు.