ఈఫిల్ టవర్ మూసివేత.. 136 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఎన్నిసార్లు మూసివేశారంటే?

Wait 5 sec.

ఫ్రాన్స్‌లో ఖర్చుల తగ్గింపు, ధనవంతులపై పన్ను పెంపు డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్‌ను అధికారులు కొన్ని రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 2వ తేదీ నుంచి మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 136 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఈఫిల్ టవర్.. సమ్మెలు, 2015 పారిస్ దాడులు, కొవిడ్-19, ఈఫిల్ టవర్‌ను ఎక్కేందుకు చేసిన ప్రయత్నాల సందర్భంగా గతంలో కూడా అనేకసార్లు తాత్కాలికంగా మూసివేశారు.ఫ్రెంచ్ ప్రభుత్వం ఖర్చుల తగ్గింపు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు.. ధనవంతులపై అధిక పన్నులు విధించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. దీంతో అక్టోబర్ 2 వ తేదీ నుంచి 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. ఫ్రాన్స్‌లోని ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ దేశవ్యాప్త పిలుపుతో.. సమ్మె చేపట్టారు. రాజకీయ సంక్షోభం, బడ్జెట్ చర్చల నేపథ్యంలో గత నెలలో ప్రారంభమైన నిరసనలు ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.లా డామ్ డి ఫెర్ (ఐరన్ లేడీ) అని పిలిచే ఈ ఈఫిల్ టవర్‌కు 136 ఏళ్ల చరిత్ర ఉండగా.. చాలాసార్లు మూసివేయబడింది. 2018 ఆగస్ట్‌ నెలలో.. ఈఫిల్ టవర్ వద్ద పనిచేసే ఉద్యోగులు వాకౌట్ చేయడంతో.. ఈఫిల్ టవర్‌ను సందర్శకుల నిర్వహణలో మార్పులు, టూరిస్ట్‌ల రద్దీని నిరసిస్తూ 2 రోజుల పాటు మూసివేశారు. ఇక 2024 ఫిబ్రవరి నెలలోనూ ఈఫిల్ టవర్ నిర్వహణ, సిబ్బంది సంక్షేమం కోసం సరైన పెట్టుబడులు పెట్టడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ.. సమ్మె చేశారు.2019 మే నెలలో ఒక వ్యక్తి ఈఫిల్ టవర్‌ను ఎక్కేందుకు ప్రయత్నించడంతో భద్రతా కారణాలతో అక్కడ టూరిస్ట్‌లను ఖాళీ చేయించి మూసివేశారు. 2024 ఆగస్ట్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు కొన్ని గంటల ముందు.. ఈఫిల్ టవర్‌ను ఎక్కుతూ ఒక కనిపించడంతో వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రాంతంలో అందర్నీ ఖాళీ చేయించారు.2020 మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి కారణంగా ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా కొవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. 2015 నవంబర్ నెలలో పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఈఫిల్ టవర్‌ను అధికారులు కొన్ని రోజుల పాటు మూసివేశారు. 2023 డిసెంబర్ నెలలో ఈఫిల్ టవర్ సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో ఒక జర్మన్ టూరిస్ట్ హత్యకు గురి కావడంతో అప్పుడు మూసివేయబడింది. 2024 వేసవి ఒలింపిక్స్ తర్వాత సెప్టెంబర్ నెలలో ఈఫిల్ టవర్‌కు అమర్చిన 30 టన్నుల ఒలింపిక్ రింగులను తొలగించేందుకు నిర్వహణ పనులు చేపట్టడంతో అప్పుడు దాన్ని మూసివేశారు. 1887-1889 మధ్య ఫ్రెంచ్ విప్లవ శతాబ్ది వేడుకల కోసం ఇంజనీర్ గుస్టావ్ ఈఫిల్ కంపెనీ ఈ ఈఫిల్ టవర్‌ను నిర్మించింది. ఈ అత్యద్భుత కట్టడం ఫ్రాన్స్ సాంస్కృతిక చిహ్నంగా వెలుగొందుతోంది.