ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక శాఖకు సంబంధించి.. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.252.86 కోట్లతో ఆధునికీకరణ, విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నిధులతో రాష్ట్రంలో కొత్తగా 17 అగ్నిమాపక కేంద్రాలు ( ఫైర్ స్టేషన్లు) ఏర్పాటు చేయడంతో పాటు, 36 చోట్ల పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తారు. అమరావతిలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రం కూడా రానుంది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ ప్రతిపాదనలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఆమోదం తెలిపారు.ఈ నిధులతో అగ్నిమాపక సేవలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రజలకు మెరుగైన భద్రతా సేవలు అందుతాయని చెబుతున్నారు. కొత్త కేంద్రాల ఏర్పాటుతో అత్యవసర సమయాల్లో స్పందించే వేగం పెరుగుతుందని.. అమరావతిలో ఏర్పాటు చేయనున్న రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రం అన్ని అగ్నిమాపక కేంద్రాలను సమన్వయం చేస్తుంది అని తెలిపారు. అలాగే సమాచారం వేగంగా చేరడంతో పాటు, సహాయక చర్యలు సమర్థవంతంగా జరుగుతాయి. ఆధునిక పరికరాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో శాఖ మరింత బలోపేతం అవుతుంది. ఇది ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏపీలో కొత్తగా ఏర్పాటు కానున్న అగ్నిమాపక కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.. నాతవలస (విజయనగరం జిల్లా).. విశాఖపట్నం మధురవాడ, మహారాణిపేట, సింహాచలం.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, అరకు.. తూర్పుగోదావరి జల్లా రాజమహేంద్రవరం రూరల్‌-బొమ్మూరు.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం.. గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలోని ఏపీ హైకోర్టు వద్ద- నేలపాడు.. బాపట్ల జిల్లా అద్దంకి.. ప్రకాశం జిల్లా పొదిలి.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం.. తిరుపతి రూరల్.. కడప జిల్లా ముద్దనూరు.. నంద్యాల జిల్లా నందికొట్కూరు.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం.. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుతో పాటుగా .. రాష్ట్రంలో పలు ఫైర్ స్టేషన్ల పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి.