ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ ముంబైలో పలు సంస్థల సీఈవోలు, ఎండీలు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లతో సమావేశమయ్యారు. మంత్రి లోకేశ్ టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో కూడా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఆయన వివరించారు. ముఖ్యంగా, టాటా పవర్‌ రెన్యూవబుల్స్‌తో కలిసి రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని, అలాగే సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి కోరారు. విశాఖలో టాటా ఎల్క్సీ ప్రాంతీయ కార్యాలయం/ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, తూర్పు తీరంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని కూడా సూచించారు. ఈ నెలలో డెవలప్‌మెంట్ సెంటర్‌ ప్రారంభంకానుండగా.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాటా గ్రూపు ప్రతినిధులను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూపు భాగస్వామ్యం కావాలని, అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులలో కలిసి పనిచేయాలని, అలాగే సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖలో టాటా ఎలక్సీ సెంటర్‌ను స్థాపించాలని, పలు రంగాలలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. శ్రీసిటీలో ఈవీ భాగాల తయారీ యూనిట్లను స్థాపించాలని కోరుతూ, భూమి, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ఇస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, రహేజా గ్రూప్‌తో సమావేశమై విశాఖలో గ్రేడ్-ఎ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్కు అభివృద్ధి చేయాలని కోరారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌ను రహేజా గ్రూప్, ప్రిన్స్‌టన్ డిజిటల్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని, అమరావతిలో వెస్టిన్ లేదా జేడబ్ల్యూ మారియట్ 5-స్టార్ హోటల్ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. విశాఖలో నిర్మాణంలో ఉన్న మాల్‌ను పూర్తి చేసి, అదే తరహాలో విజయవాడ, అమరావతిలోనూ మాల్స్ ఏర్పాటు అవకాశాలను అన్వేషించాలని మంత్రి సూచనలు చేశారు. విశాఖపట్నంలో బిజినెస్ పార్కును అభివృద్ధి చేస్తే ఉద్యోగ అవకాశాలను పెంచడమే కాకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అలాగే ఏపీలో పీసీలు, ల్యాప్‌టాప్‌లు, వర్క్‌స్టేషన్‌ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్‌ హెచ్‌పీ సంస్థను కోరారు. తిరుపతిలో పీసీ కాంపొనెంట్‌ తయారీ పార్క్‌లు అభివృద్ధి చేయాలని, అలాగే హెచ్‌పీ సప్లై చైన్‌ భాగస్వామ్య సంస్థలైన ఫాక్స్‌కాన్, క్వాంటా, ఇన్వెన్‌టెక్‌లను రాష్ట్రానికి రప్పించడంలో సహకరించాలని ఆయన కోరారు. తిరుపతి శ్రీసిటీలో రూ.900 కోట్లతో జరుగుతున్న విస్తరణ పనులను 2026 నాటికి పూర్తి చేయాలని మంత్రి బ్లూస్టార్‌ లిమిటెడ్‌ను కోరారు. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ వీర్‌ ఆడ్వాణీతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి డేటా కూలింగ్‌ సొల్యూషన్స్‌పై పనిచేయాలని కూడా మంత్రి ప్రతిపాదించారు. మొత్తం మీద ఏపికి ఐటీ కంపెనీలతో పాటుగా పరిశ్రమలు రాబోతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నానికి ఐటీ కంపెనీల రాకతో భూముల ధరలు పెరిగాయి.