ఈ ఏడాది వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో పాటు వరుస అల్ప పీడనాలు.. వీటన్నింటి ప్రభావంతో తెలంగాణలో ఇప్పటి వరకు కుండపోత వానలు కురిశాయి. ఈ సంవత్సరం వార్షిక సగటు కన్నా ఎక్కువ వర్షపాతమే నమోదయ్యింది. అక్టోబర్ నాటికి తెలంగాణలో వర్షాకాలం పూర్తి కావాలి. కానీ ఈ ఏడాది పరిస్థితి అలా లేదు. పైగా అక్టోబర్ నెలంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. దీనికి తగ్గట్టే వచ్చే వారం అంతా తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురవనున్నాయి. ఆ వివరాలు.. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారభంలో తెలంగాణలో పెద్దగా వర్షాలు కురవలేదు. అంటే జూన్, జులై నెలలో సాధారణ వర్షపాతం.. కొన్ని ప్రాంతాల్లో అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యింది. కానీ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కుండపోత వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. హైదరాబాద్, పరిసర జిల్లాలు వాన ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. అక్టోబర్ నెలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం.. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.వచ్చే వారం అంతా తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌-గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు.. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగానే ద్రోణికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. నేడు మరింత బలపడి.. ఈనెల అంటే అక్టోబర్ 11నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే వారం అంతా తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక శుక్రవారం వాతావరణం విషయానికి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేడు ఉదయం సమయం అంతా పొడి వాతావరణం ఉంటుందని.. హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం నుంచి కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం నాడు ఉరుములు, మెరుపులుతో కుడిన వర్షాలు కురుస్తాయని.. అలానే ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలానే రేపు అనగా.. శని, ఆదివారాల్లో కూడా నల్లగొండ, మహబాబూబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.