274 రహదారులకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం..

Wait 5 sec.

మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే లైన్ల నిర్మాణంతో పాటుగా.. కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్ర రహదారులపై దృష్టి సారించింది. గుంతలు పడిన రహదారుల నుంచి ప్రజలకు ఇబ్బందులు తప్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ.1000 కోట్లు మంజూరు చేసింది. 274 రోడ్ల మరమ్మతుల కోసం ఈ వేయి కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి.ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ వేయి కోట్ల రూపాయలలో రూ.400 కోట్లు వెచ్చించి స్టేట్ హైవేలలో 108 పనులు చేపట్టనున్నారు. మరో రూ.600 కోట్లతో జిల్లా రోడ్లలో 166 పనులు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల రోడ్ల స్థితి, ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాల ప్రభావం, ప్రయాణికుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రహదారుల మరమ్మత్తు పనులతో పాటుగా పాత రహదారుల పునరుద్ధరణ, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచటం.. కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం, బైపాస్ మార్గాలను ఆధునీకరణ వంటి అంశాలను కూడా ప్రాధాన్యాలుగా పరిగణిస్తామని రోడ్లు, భవనాల శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో భారీగా వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో ఏపీవ్యాప్తంగా విస్తారంగా వానలు పడ్డాయి. దీంతో పలు జిల్లాలలో రోడ్లు దెబ్బతిన్న పరిస్థితి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో రహదారులు అక్కడక్కడా కోతకు గురికావటం, గుంతలు పడటం జరిగింది. ఈ నేపథ్యంలో గుంతలు పడిన రహదారుల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడటమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయంతో ప్రభుత్వం రహదారుల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పనులను ప్రారంభించే అవకాశం ఉంది.