ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్.. క్వాంటం మెకానిక్స్‌పై పరిశోధనలకు పురస్కారం

Wait 5 sec.

: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సోమవారం రోజున మెడిసిన్ విభాగంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించగా.. తాజాగా ఇవాళ భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన వారిని ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే ఈసారి ఫిజిక్స్ విభాగంలో ముగ్గురు నోబెల్ బహుమతిని దక్కించుకున్నారు. జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లు ఈసారి ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. క్వాంటం మెకానిక్స్‌పై చేసిన పరిశోధనలకు గానూ ఈ ముగ్గురికి నోబెల్ బహుమతి అందించనున్నట్లు ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణ చేసినందుకు గానూ.. జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లకు నోబెల్ పురస్కారం వరించింది. ఇక సోమవారం రోజున మెడిసిన్ విభాగంతో ఈ నోబెల్ విజేతల ప్రకటన ప్రారంభం అయింది. ఈనెల 13వ తేదీన ప్రకటనతో.. ఈ ప్రక్రియ పూర్తి కానుంది. డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారాల ప్రదానం జరగనుంది. ప్రతీ సంవత్సరం మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, శాంతి వంటి వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచినవారికి ఈ నోబెల్‌ పురస్కారాలను అందించనుండగా.. వారిని ఎంపిక చేసి.. రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. ఇక సోమవారం మొట్టమొదట వైద్య రంగంలో చేసిన కృషికి గానూ ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఇ బ్రున్‌కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచీలకు నోబెల్ బహుమతి వరించింది. రోగనిరోధక వ్యవస్థను అదుపులో ఉంచడానికి సంబంధించి పరిశోధనలు చేసినందుకు వీరికి నోబెల్ బహుమతి దక్కింది. స్వీడన్‌ సైంటిస్ట్, ఇంజినీర్‌, బిజినెస్‌మెన్‌ ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి సందర్భంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన బహుమతులు దక్కించుకున్న వారికి ఈ నోబెల్ పురస్కారాలను అందిస్తారు. విజేతలకు నోబెల్ బహుమతితో పాటు.. 10 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్ల నగదు ఇవ్వనున్నారు. 1896లో ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ నోబెల్ అవార్డులను ప్రతీ సంవత్సరం ప్రదానం చేస్తున్నారు.