: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గత 4 సెషన్లుగా మంచి లాభాల్లో కదలాడిన సంగతి తెలిసిందే. రోజుకు సెన్సెక్స్ 500 పాయింట్ల వరకు కూడా పెరిగింది. అయితే వరుస లాభాలకు బుధవారం సెషన్‌లో బ్రేక్ పడింది. అక్టోబర్ 8న దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో (మధ్యాహ్నం 12.40 గంటలకు) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా పతనంతో 81,770 వద్ద ఉండగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 25 వేల మార్కుపైన ఉంది. దీంతో సూచీలు నష్టపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం దిగ్గజ టాటా గ్రూప్ సంస్థకు చెందిన టాటా మోటార్స్ షేర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది వరుసగా నాలుగో సెషన్‌లో పతనమైంది. ఇవాళ దాదాపు 2 శాతం వరకు పడిపోయింది. ప్రస్తుతం 1.50 శాతం నష్టంతో రూ. 687 స్థాయిలో ఉంది. గత 4 సెషన్లలో ఈ స్టాక్ ధర 5 శాతం వరకు తగ్గింది. ఒకే ఒక్క కారణంతో ఈ స్టాక్ పతనం అవుతుండటం గమనార్హం. అదేంటో చూద్దాం. టాటా మోటార్స్ ఇప్పుడు రెండుగా విడిపోతుంది. టాటా మోటార్స్ నుంచి కమర్షియల్ వెహికిల్స్ (CV) బిజినెస్ విభజన చెంది.. కొత్త సంస్థగా అవతరిస్తోంది. ఇది టీఎంఎల్ కమర్షియల్ వెహికిల్స్ లిమిటెడ్‌గా (TMLCV) ఉంటుంది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ ప్రస్తుత టాటా మోటార్స్‌లోనే ఉంటుంది. ఇది ఇప్పుడు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్‌గా మారుతుంది. ఈ విభజన 2025, అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చినప్పటికీ.. అక్టోబర్ 14 రికార్డు తేదీగా ఉంది. >> టాటా మోటార్స్ విభజన 1:1 రేషియోలో జరగనుండగా.. ఇక్కడ షేర్ల విభజన కూడా అదే విధంగా ఉంటుంది. టాటా మోటార్స్‌లో ఉన్న ప్రతి ఈక్విటీ షేరుపై రూ. 2 ఫేస్ వాల్యూతో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్ లిమిటెడ్ షేర్లు కూడా పోర్ట్‌ఫోలియోలోకి వస్తాయి. ఇక్కడ ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ ఏం మారదు. దానికి అనుగుణంగా షేర్లను అడ్జస్ట్ చేస్తారు. ఇక్కడ డీమెర్జర్ నేపథ్యంలో.. టాటా మోటార్స్ షేర్ ధర కూడా సగానికే తగ్గే అవకాశం ఉంది. అక్టోబర్ 14న ఈ షేర్లు వస్తాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు.. ఒత్తిడికి లోనై షేర్లను విక్రయిస్తుండగా స్టాక్ పతనం అవుతోంది. టాటా మోటార్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 2.53 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 948.45 గా ఉండగా.. 52 వారాల కనిష్ట ధర రూ. 535.75 గా ఉంది.