Gold Price Outlook: మనకు పెట్టుబడుల కోసం ఎన్నో ఆప్షన్లు కనిపిస్తుంటాయి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గోల్డ్, సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడే మనం గందరగోళానికి గురవుతుంటాం. డబ్బు ఎక్కడ పెడితే ఎక్కువ లాభం వస్తుందోనని లెక్కలు వేసుకునేలోపే పెట్టుబడుల్ని వాయిదా వేస్తుంటాం. సాధారణంగా స్టాక్ మార్కెట్లలో రిస్క్ ఉన్నప్పటికీ.. ఇక్కడే ఎక్కువ లాభాలు వస్తాయని నిపుణలు చెబుతుంటారు. ఇక్కడ రిటర్న్స్ అంచనా వేయడానికి నిఫ్టీ 50ని ప్రామాణికంగా తీసుకుంటుంటారు. కానీ ఏడాది వ్యవధిలో భారతీయ పెట్టుబడిదారులకు అధిక రాబడి ఎక్కడ వచ్చిందో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారనడంలో సందేహం లేదు. అవును.. ఊహించని విధంగా ఈసారి వెండి, బంగారం.. స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50, ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాయి. వీటిల్లో ఏడాది కిందట అంటే గతేడాది అక్టోబర్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు ఎంత వచ్చేదో.. పెట్టుబడి పెట్టిన వారికి ఎంత వచ్చిందో తెలుసుకుందాం. వెండి: ఈ ఏడాది కాలంలో వెండి అత్యధిక రిటర్న్స్ ఇచ్చింది. రూ. 1 లక్ష పెట్టుబడిపై రూ. 61,240 లాభం ఇచ్చింది. అంటే ఇక్కడ 61 శాతానికిపైగా పెరిగిందన్నమాట. ఏడాది కిందట కిలో వెండి ధర రూ. 1 లక్ష దగ్గర ఉండగా.. ఇప్పుడు రూ. 1.61 లక్షల మార్కు దాటి దూసుకెళ్తోంది. పారిశ్రామిక అవసరాలు సహా సోలార్ టెక్నాలజీ వంటి వాటిల్లో వెండికి డిమాండ్ పెరగడం.. బంగారం కంటే ధర తక్కువగా ఉండటం వల్ల ధర పెరుగుతూ వెళ్తోంది. బంగారం: గోల్డ్ కూడా ఈ ఏడాది ఏ మాత్రం తగ్గలేదు. ఊహించిని దానికి మించి బంగారం ధర భారీగా పెరిగింది. రోజూ సరికొత్త గరిష్ట స్థాయిల్ని తాకుతూనే ఉంది. 10 గ్రాముల బంగారం ధర ఏడాది కిందట సుమారు రూ. 78 వేల వద్ద ఉండగా.. ఇప్పుడు రూ. 1.20 లక్షల మార్కు దాటి ట్రేడవుతోంది. దాదాపు 45 శాతం రాబడి అందించింది. ఇక్కడ కేంద్ర బ్యాంకుల విపరీత కొనుగోళ్లు, ప్రపంచ అనిశ్చితి వంటివి కారణాలుగా ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ అంచనాల ప్రకారం.. 2026 డిసెంబర్ నాటికి ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 4900 డాలర్లకు చేరొచ్చని తెలుస్తోంది. అప్పుడు ఇండియాలో రూ. 1.35 లక్షలు దాటనుంది.ఫిక్స్‌డ్ డిపాజిట్: ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లు దీనికి ఆసక్తి చూపిస్తుంటారు. సగటున 7 శాతం వడ్డీ రేట్లు ఉండగా.. రూ. 1 లక్ష పెట్టుబడిపై రూ. 7 వేలు మాత్రమే లాభం వచ్చింది. లాభం తక్కువే అయినా గ్యారెంటీ రిటర్న్స్ ఇక్కడ ఉంటాయి. నిఫ్టీ 50: భారత్ ఆర్థికపరంగా దూసుకెళ్తున్నప్పటికీ.. స్టాక్ మార్కెట్ ఏడాది వ్యవధిలో పెద్దగా రాణించలేదు. ఇక్కడ తీవ్ర ఒడుదొడుకులు ఉన్నాయి. ఏడాది వ్యవధిలో నిఫ్టీ 50 కేవలం 5 శాతమే పెరిగింది. లక్ష పెట్టుబడిపై రూ. 1260 నికర లాభం మాత్రమే వచ్చింది. స్వల్పకాలంలో తక్కువ రాబడే వచ్చినప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడి అందించేందుకు దీనిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. భవిష్యత్తు అంచనాలపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. ఇప్పుడు ఇంతలా పెరిగింది కాబట్టి వచ్చే ఏడాది పడిపోయే అవకాశం ఉందని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం కేంద్ర బ్యాంకులు విపరీతంగా గోల్డ్ కొనుగోలు చేస్తున్న క్రమంలో.. ఇంకా పెరుగుతుందని అంటున్నారు. మరోవైపు.. వెండిని కేంద్ర బ్యాంకులు కొనట్లేవు కాబట్టి ఈ ధర పతనం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.