ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ.. తెలంగాణలో మాత్రం రోజురోజుకూ ప్రాభవాన్ని కోల్పోతోంది. అడపాదడపా ఏదో ఒక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను దింపినా.. ఘోర పరాభవాలే ఎదురవుతున్నాయి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం మహా కూటమి పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. ఘోర పరాజయమే చవిచూసింది. ఈ క్రమంలోనే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా నాయుడు.. అవకాశం వచ్చిన ప్రతీసారి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నా.. అవి ఫలించడం లేదు. హైకమాండ్ పట్టించుకోకపోవడంతో.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇంకా ఉన్న కొందరు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో.. తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది తేల్చుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు తెలంగాణ తెలుగుదేశం నేతలు.. ఇవాళ ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని.. సమావేశం అయ్యారు. జూబ్లీ హిల్స్‌ ఉపఎన్నికతోపాటు.. తెలంగాణలో స్థానిక ఎన్నికలపైనా తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ బైపోల్స్ జరగనుండగా.. అక్కడ టీడీపీకి కొంత క్యాడర్ ఉండటంతో ఏం చేయాలి అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా.. లేదంటే ఇతరులకు మద్దతు ఇవ్వాలా అనేదానిపై చర్చలు జరిపారు.ఇక తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని చంద్రబాబు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణలో కీలకంగా ఉన్న పార్టీ.. ఇప్పుడు కూడా రెండు, మూడు జిల్లాల్లో పట్టు ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో అక్కడి నుంచి మళ్లీ పార్టీని విస్తరించాలని తెలుగుదేశం నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు.