'అక్కడ ఏం ఎదురవుతుందో నాకు బాగా తెలుసు'.. కెప్టెన్సీ తొలగింపు తర్వాత తొలిసారి రోహిత్ శర్మ ఎమోషనల్ స్పీచ్!

Wait 5 sec.

వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత హిట్ మ్యాన్ తొలిసారి తన మౌనాన్ని వీడాడు. వన్డే కెప్టెన్‌గా ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో ప్రపంచ రికార్డులు సృష్టించాడు. అయితే 2027 వన్డే వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని . వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చిన రోహిత్ ఎమోషనల్ స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ముంబైలో జరిగిన సియట్ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌పై ఉత్సాహం వ్యక్తం చేశాడు. 38 ఏళ్ల రోహిత్ శర్మ, 2008లో తొలిసారి ఆస్ట్రేలియా పర్యటన చేసినప్పటి నుంచి అక్కడ సక్సెస్ అయ్యాడు. ఈసారి కూడా అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాడు. “నాకు ఆస్ట్రేలియాలో ఆడటం చాలా ఇష్టం. అక్కడి ప్రజలు క్రికెట్‌ను ఎంతగానో ప్రేమిస్తారు. అయితే, ఆస్ట్రేలియాలో ఆడటం ఎప్పుడూ సవాలే. ఎన్నిసార్లు అక్కడికి వెళ్లినా, ప్రతి సారి కొత్త అనుభవమే ఉంటుంది. ఇప్పుడు నాకు అక్కడ ఏం ఎదురవుతుందో బాగా తెలుసు. భారత జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడి, విజయం సాధిస్తామని ఆశిస్తున్నాను” అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మార్చిలో జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలిపిన రోహిత్, ఆ తర్వాత టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే కెప్టెన్‌గా రోహిత్ కొనసాగుతాడు అనుకున్న సమయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అందరికీ షాక్ ఇస్తూ శుభమన్ గిల్‌కు పగ్గాలు అప్పగించారు. ఇది రోహిత్ సక్సెస్ జర్నీకి ముగింపు పలికి.. భారత జట్టు కొత్త శకానికి అడుగుగా మారింది. “మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సాధ్యం కాదు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, ముఖ్యంగా 2027 వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకుని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. యువ కెప్టెన్‌కు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది.వన్డే ఫార్మాట్‌ ఇప్పుడు తక్కువగా ఆడుతున్న నేపథ్యంలో, భవిష్యత్ ప్రణాళికల కోసం కొత్త నాయకుడికి ఎక్కువ సమయం ఇవ్వడం అవసరం. ఇది కేవలం సెలెక్టర్లకే కాదు, కోచ్‌కు కూడా ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో ప్రణాళికలు సిద్ధం చేయడం సులభం కాదు” అంటూ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. తన కెప్టెన్సీ తొలగింపుపై రోహిత్ ఎలాంటి ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయకపోయినా, ఆయన మాటల్లో స్పష్టమైన ప్రశాంతత కనిపించింది. 2027 వరల్డ్ కప్‌లో ఆడాలనే సంకల్పం వ్యక్తం చేసిన రోహిత్, ఈ నిర్ణయాన్ని ధైర్యంగా స్వీకరించినట్లు తెలుస్తోంది.