తెలంగాణకు రైల్వే బూస్ట్.. ఈ జిల్లాలో రైల్వే మెగా డిపో, రూ.908.15 కోట్లతో ఏర్పాటు

Wait 5 sec.

దక్షిణ మధ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా సరకు రవాణా రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా రూ.1,361 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం నిధుల్లో సింహభాగం అంటే రూ.908.15 కోట్లు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మహబూబాబాద్‌లో మెగా మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటు కోసం కేటాయించారు. సౌత్ సెంట్రల్ రైల్వే చరిత్రలో ఈ తరహా మెగా మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఈ మెగా డిపో అందుబాటులోకి వస్తే సరకు రవాణా రైళ్లకు సంబంధించి అన్ని రకాల కీలక నిర్వహణ పనులు ఇక్కడే జరుగుతాయి. ఇందులో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్, రెగ్యులర్ ఓవర్‌ హాలింగ్ వంటి ప్రధాన నిర్వహణ కార్యకలాపాలు, అలాగే సిక్ లైన్, ట్రైన్ ఎగ్జామినేషన్ వంటి అత్యాధునిక సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా సరకు రవాణా రైళ్ల మరమ్మత్తులు, తనిఖీలు మరింత వేగంగా, సమర్థవంతంగా పూర్తవుతాయి.ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రయోజనాలుఅంబ్రెల్లా వర్క్స్ కింద మంజూరైన ఈ ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలాన్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు విస్తరించడం వలన రైళ్ల ఆలస్యం తగ్గుతుందని.., సరకు రవాణా వేగం పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్‌ జిల్లాకు ఈ డిపో రాకతో ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక పారిశ్రామికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని అంటున్నారు. ఈ మెగా డిపో ద్వారా సరకు రవాణా వ్యవస్థ మరింత పటిష్టమై, కేంద్ర ప్రభుత్వ గతిశక్తి మిషన్ లక్ష్యాలను చేరుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వేకు ఒక కీలకమైన చర్యగా పరిగణించవచ్చునని చెబుతున్నారు. త్వరలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.