రైల్వే ప్రయాణికులూ.. టికెట్ రిజర్వేషన్‌లో ఈ కొత్త మార్పులు తెలుసా?

Wait 5 sec.

IRCTC Rules: రైలు ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ రిజర్వేషన్ ప్రక్రియలో భారతీయ రైల్వే ఇటీవల కొన్ని మార్పులు చేసింది. టికెట్ల జారీలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కీలక చర్యలు చేపట్టింది. అందులో ప్రధానంగా ఆధార్ అథంటికేషన్, ఓటీపీ ఉన్నాయి. ఆధార్ అథంటికేషన్ ఉన్న ఖాతాల ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. తత్కాల్ టికెట్లతో పాటు జనరల్ రిజర్వేషన్‌కు సైతం ఆధార్ తప్పనిసరి చేసింది. అలాగే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సమయాన్నీ తగ్గించింది. ఇలా కొద్ది రోజులుగా రైల్వే రిజర్వేషన్‌లో చాలా మార్పులు వచ్చాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లై రైళ్లకు బయలుదేరే 8 గంటల ముందే ప్రయాణికుల చార్ట్ సిద్ధం చేస్తారు. ఇంతకు ముందు ఇది రైలు బయలుదేరే 4 గంటల ముందు ఉండేది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. టికెట్ కన్ఫామ్ కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే వీలు ఉండేలా సమయాన్ని పెంచారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు బయలుదేరే రైళ్లకు ముందురోజు రాత్రి 9 గంటలకు, 2 గంటల తర్వాత బయలుదేరే రైళ్లకు అయితే 8 గంటల ముందు టికెట్ వివరాలను రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు మెసేజ్ చేస్తున్నారు. జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు అమలలోకి తెచ్చారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ఆధార్ అథంటికేషన్, కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జూలై 15వ తేదీ నుంచి ఆధార్ ఓటీపీని సైతం తప్పనిసరి చేశారు. తత్కాల్ టికెట్ల అక్రమాలను అడ్డుకునేందుకు దీనిని తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ పేర్కొంది. అలాగే తత్కాల్ కౌంటర్లు, ఆథరైజ్డ్ ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేస్తే ఆధార్ ఓటీపీని జూలై 15 నుంచి తప్పని సరి చేశారు. ఏజెంట్లకు తొలి అరగంట పాటు తత్కాల్ రిజర్వేషన్ టికెట్లు బుకింగ్ అవకాశాన్ని ఆపేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏ రైలుకైనా బుకింగ్ విండో మొదలైన తొలి 15 నిమిషాలు ఆధార్ వెరిఫైడ్ అకౌంట్లకో బుకింగ్ అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ల తేదీని ఆన్‌లైన్‌లోనే మార్చుకునే అవకాశం కల్పించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. 2026 జనవరి నాటికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం ప్రయాణ తేదీ మార్చుకోవాలంటే టికెట్ రద్దు చేసి కొత్తగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానం అమలులోకి వస్తే ఉచితంగా తేదీ మార్చుకునే అవకాశం లభిస్తుంది.