ఇటీవల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలువురు చిన్నారులు ప్రాణాలు పోవడానికి దగ్గుమందే కారణం అంటూ వార్తలు రావడం పెను సంచలనంగా మారింది. దీంతో కొన్ని రకాల దగ్గు మందులపై కేంద్ర ప్రభుత్వంతోపాటు.. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నిషేధం విధించాయి. అదే సమయంలో 2 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు దగ్గు సిరప్ వాడకూడదని.. 5 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు సిరప్‌ను సూచించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన వేళ.. వినియోగంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిఫ్‌ కాఫ్ సిరప్‌ కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దగ్గు మందు వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పందించింది. ఈ ఔషధం ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసినట్లు తెలుస్తోంది. పిల్లల మృతికి కారణమైన ఈ కోల్డ్‌రిఫ్‌ దగ్గు మందును ఇతర దేశాలకు ఎగుమతి చేశారా అని డబ్ల్యూహెచ్‌ఓ భారత్‌ వద్ద క్లారిటీ తీసుకుంది. సంబంధిత అధికారుల నుంచి వివరణ వచ్చిన తర్వాత దీనిపై గ్లోబల్‌ మెడికల్‌ ప్రొడక్ట్స్‌ అలర్ట్‌ జారీ చేయాలా వద్దా అనే దానిపై డబ్ల్యూహెచ్ఓ అంచనా వేయనుందని నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి.ఇక దగ్గు సిరప్ కారణంగా దేశంలో చిన్న పిల్లలు చనిపోతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో మృతుల సంఖ్య 20కి చేరడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందులో ఒక్క చింద్వాడాలోనే 17 మంది చనిపోయినట్లు మధ్యప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర శుక్లా బుధవారం వెల్లడించారు. మరో ఐదుగురు చిన్నారుల పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. ఇలాంటి కల్తీ దగ్గుమందు తీసుకుని.. రాజస్థాన్‌లో కూడా పలువురు చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది.ఈ కోల్డ్‌రిఫ్‌ దగ్గు సిరప్‌ను తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీసన్‌ ఫార్మా యూనిట్‌ తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక చిన్నారుల మృతి నేపథ్యంలో ఆ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా.. ఈ సిరప్‌లో 48.6 శాతం డైఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఈ డైఇథైలిన్‌ గ్లైకాల్‌ అత్యంత విషపూరితమైనదిగా అధికారులు తేల్చారు. ఈ క్రమంలోనే శ్రీసన్ ఫార్మా యూనిట్ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు.. ఈ కోల్డ్‌రిఫ్ సిరప్‌పై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి.