డాక్టర్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ సీట్లు పెంపు..!

Wait 5 sec.

డాక్టర్ కావాలనుకునే వారికి శుభవార్త. తెలంగాణలో మెడికల్ సీట్ల పెంపునకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్‌సీ) పచ్చజెండా ఊపింది. రెండు ప్రవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఇటీవలే 50 సీట్లు, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీకి 25 సీట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఎన్ఎమ్‌సీ.. తాజాగా వీటికి కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో మరో 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నోవా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెటికల్ సైన్సెస్స్‌కు.. 50 సీట్లు, మహావీర్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెటికల్ సైన్సెస్స్‌కు.. మరో 50 సీట్లు పెంచుకోవడానికి ఎన్ఎమ్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నోవా, మహావీర్ కాలేజీలలో ప్రస్తుతం 150 చొప్పున ఉన్న సీట్ల సంఖ్య.. 200కు చేరుతుంది. వీటితో కలిపి మొత్తంగా ఈ ఏడాదిలో.. తెలంగాణలో 175 కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. కాగా, పెరిగిన సీట్లన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది పెరిగిన 175 సీట్లతో కలిపి.. మొత్తంగా తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,640కి చేరింది. రాష్ట్రంలో ఉన్న 35 ప్రభుత్వ కళాశాలలో 4,265 సీట్లు, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,200 సీట్లు ఉన్నాయి. కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీతో కలిపి.. వైద్య కళాశాల సంఖ్య 65కు చేరింది. మరోవైపు, సెప్టెంబర్‌లో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మెడికల్ సీట్ల పెంపుపై ప్రభుత్వం కీకల నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10, 000 సీట్లు పెంచాలని నిర్ణయించింది. దీంతో వైద్య విద్య సామర్థ్యం పెరుగుతందని.. తద్వారా ఎక్కువ స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి వస్తారని కేంద్రం చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త డిపార్ట్‌మెంట్‌లు ఏర్పాటు చేయడానికి వీలుకలుగుతుందని తెలిపింది. దీని కోసం రానున్న రోజుల్లో రూ. 15, 034 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణలో కూడా మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో స్థానికత సమస్య కూడా పరిష్కారం కావడంతో డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు ఇది మంచి విషయమనే చెప్పాలి. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దీని ప్రకారం స్థానిక కోటా 85 శాతం కింద ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు.. ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలి. ఈ నిబంధన సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.