మోదీతో ఫోన్‌లో మాట్లాడేందుకు.. గాజా సీజ్‌ఫైర్ మీటింగ్ ఆపిన నెతన్యాహు

Wait 5 sec.

Netanyahu Pause Meeting For Modi: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపుకు శాంతి ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా కాల్పుల విరమణ , బందీల విడుదల ఒప్పందం గురించి గురువారం రోజు భద్రతా క్యాబినేట్‌తో చర్చించారు. అయితే ఈ కీలక సమావేశం జరుగుతున్న సమయంలోనే.. నెతన్యాహు ఎవరూ ఊహించని ఓ పని చేశారు. ఈ కీలకమైన సమావేశాన్ని నిలిపివేసి మరీ.. తన ప్రియమైన మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ విషయాన్ని నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయమే వెల్లడించింది. ఈ సంభాషణ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన గాజా శాంతి ప్రణాళికలో సాధించిన పురోగతిపై తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. నా మిత్రుడు, ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి.. అధ్యక్షుడు ట్రంప్ గాజా శాంతి ప్రణాళికలో సాధించిన పురోగతికి అభినందనలు తెలియజేశానని పేర్కొన్నారు. బందీలను విడుదల చేసే ఒప్పందాన్ని, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయాన్ని అందించేందుకు కుదిరిన అంగీకారాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో, ఏ ప్రాంతంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదు అని మరోసారి స్పష్టం చేశామని మోదీ పోస్ట్ చేశారు.దీనికి ముందే ప్రధాని మోదీ.. డొనాల్డ్ ట్రంప్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు. చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక వజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చల గురించి కూడా తాము సంభాషించుకున్నామని మోదీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెడుతూ.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడే భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని చెప్పింది. బందీలందరినీ విడుదల చేసేందుకు కుదిరిన ఒప్పందానికి ప్రధాని నెతన్యాహుకు నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారని వివరించింది. గత రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్ గురువారం రోజు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. కాల్పుల విరమణ జరుగుతుంది. గాజా నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటుంది. తాను బంధించిన బందీలు అందరినీ హమాస్ విడుదల చేస్తుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తన అధీనంలో ఉన్న వందలాది మంది పాలస్తీనా బందీలను విడుదల చేస్తుంది.