తెలంగాణకు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాల ప్రభావం నేడు, రేపు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సమయం దగ్గర పడుతున్నా.. ఉపరితల ద్రోణి ప్రభావంతో అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. రానున్న కొన్ని గంటల్లో రాష్ట్రంలో తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి మొదలయ్యే ఈ గాలివానలు మరికొన్ని గంటల్లో నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలను కమ్మే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో రాజధాని హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ తీవ్రమైన మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గత రెండు రోజులుగా నల్గొండ జిల్లాలో కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం కనగల్‌లో అత్యధికంగా 110.5 మి.మీ., నిడమానూరులో 95.8 మి.మీ., అనుముల హాలియాలో 77.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా పరిధిలోని తిప్పర్తిలో 74 మి.మీ., పెద్దవూరలో 71 మి.మీ., తిరుమలగిరి సాగర్‌లో 48.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతోందని.. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ - కోదాడ వైపు రానున్న కొన్ని గంటలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.మహానగరం హైదరాబాద్ విషయానికి వస్తే.. నగరంలో రాత్రిపూట తేలికపాటి వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ఆకాశం మేఘావృతమై ఉండి.. రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ వాతావరణ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా చెట్లు విరిగిపడటం, విద్యుత్ అంతరాయాలు ఏర్పడటం వంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.