తెలంగాణలో మరో టెట్ నోటిఫికేషన్.. ఈ సారి టీచర్లకు కూడా..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు నేపథ్యంలో ఈసారి టెట్ నిర్వహణకు సంబంధించిన జీవోలో ముఖ్యమైన మార్పులు చేయనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు విద్యా శాఖాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో విధిగా టెట్.. గతంలో 2011 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరే వారికి మాత్రమే టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ.. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో ఈ నియమం మారింది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు (ఇన్-సర్వీస్ టీచర్స్) కూడా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి కానుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు.. ప్రస్తుతం ఉన్న టెట్ జీవోలో సవరణలు చేయాల్సి ఉంది. ఉద్యోగ ప్రమోషన్లకు కూడా టెట్ అర్హత విధిగా ఉండాలనే అంశాలను కొత్త జీవోలో పొందుపరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల కారణంగా.. ఉద్యోగోన్నతుల కోసం పోటీ పడే ఉపాధ్యాయులు సహా సుమారు 45 వేల మందికి పైగా ఇన్-సర్వీస్ టీచర్లు రాబోయే రెండేళ్లలో టెట్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ప్రమోషన్లకు దరఖాస్తు చేసుకునే వారిని కలిపితే ఈ సంఖ్య 60 వేల వరకు చేరే అవకాశం ఉంది. వీరంతా రాబోయే పరీక్షకు సమాయత్తం అవుతున్నారు. టెట్ నిర్వహణపై ప్రభుత్వ ఆదేశాలు.. గతంలో టీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే టెట్ జరిగింది. వాస్తవానికి.. నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ఏటా రెండు సార్లు విధిగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహించగా.. తాజాగా వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై విద్యాశాఖ రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించినప్పటికీ.. టెట్ నోటిఫికేషన్ ప్రక్రియ మాత్రం ప్రణాళిక ప్రకారం వచ్చే నెల విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.