దీపావళి వేళ బాణసంచాపై నిషేధం ఎత్తేయండి.. సుప్రీంకోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

Wait 5 sec.

: ఢిల్లీతోపాటు దాని పరిసర రాష్ట్రాల్లో ఏటా శీతాకాలం.. ఏర్పడే కాలుష్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం.. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశ రాష్ట్రాలు మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌లోని పలు నగరాలు టాప్ జాబితాలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా భారతదేశ రాజధాని ఢిల్లీ ఉందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏటా శీతాకాలంలో ఢిల్లీ సహా కాలుష్య ప్రభావిత రాష్ట్రాల్లో అనేక ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో బాణసంచా తయారు చేయడం, కాల్చడం, విక్రయించడాన్ని ఇప్పటికే నిషేధించింది. అయితే ఇప్పుడు దాన్ని సవరించాలని పలు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాయి. పండగ వేళ.. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో బాణసంచా కాల్చేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నాయి. దీపావళి పండగ కోసం పిల్లలు చాలా ఎదురుచూస్తారని.. అందుకే వారికి ఇష్టమైన టపాసులను పేల్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అదే సమయంలో పర్యావరణహితమైన బాణసంచాతోనే పిల్లలను పండగ చేసుకునేలా నిషేధాన్ని ఎత్తేసి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్రాలు కోరాయి.దీపావళి పండగ రోజున రాత్రి 8 గంట నుంచి 10 గంటల వరకు కేవలం 2 గంటలపాటు పర్యావరణహితమైన బాణసంచా కాల్చడానికి అనుమతివ్వాలని ఢిల్లీ, ఎన్సీఆర్‌ రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.కొన్ని ఆంక్షలు విధిస్తూ.. పలు రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడాన్ని అనుమతించవచ్చని.. జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ అనుమతి ఇచ్చిన పర్యావరణహిత బాణసంచా మాత్రమే తయారు చేసి.. విక్రయించేలా ఆదేశాలు ఇవ్వాలని తుషార్ మెహతా కోర్టును కోరారు. అధిక పేలుడు స్వభావం ఉన్న టపాసులు తయారు చేయకుండా ఢిల్లీ ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని కోర్టుకు విన్నవించారు. అదే సమయంలో టపాసుల వ్యాపారులు అనుమతి పొందిన క్రాకర్లను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా ఇతర ఎలాంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ బాణసంచాను విక్రయించకుండా చూస్తామని చెప్పారు. దీనిపై సీజేఐ నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఢిల్లీ సహా ఎన్సీఆర్‌ ప్రాంతంలో వాయు కాలుష్యం తీవ్ర ప్రమాదకర స్థాయిలో ఉండటంతో బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 3వ తేదీన తీర్పునిచ్చింది.