తెలంగాణలో రోడ్డు భద్రతను పెంపొందించే లక్ష్యంతో నూతనంగా నిర్మించబోయే పలు జాతీయ రహదారులపై కృత్రిమ మేధ (AI) ఆధారిత అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS) అందుబాటులోకి రానుంది. ఢిల్లీ-గురుగ్రామ్‌లను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ అధునాతన టెక్నాలజీ విజయవంతం కావడంతో రాష్ట్రంలోనూ దీన్ని అమలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సన్నాహాలు చేస్తోంది. ఈ అత్యాధునిక వ్యవస్థ ముఖ్యంగా జాతీయ రహదారుల పర్యవేక్షణ, ప్రమాదాల తక్షణ గుర్తింపునకు కీలకంగా మారనుంది. ఈ రహదారులను డిజిటల్ హైవేలుగా పిలుస్తారు. వీటిని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించి, పోలీసు, రవాణా శాఖలతో పూర్తి సమన్వయంతో పర్యవేక్షించనున్నారు.ఏయే రోడ్లపై ఏటీఎంఎస్?హైదరాబాద్-విజయవాడ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉండగా.. దీన్ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు NHAI సన్నాహాలు చేస్తోంది. కన్సల్టెన్సీ డీపీఆర్ సమర్పించడంతో త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ విస్తరణ పూర్తయిన తర్వాత ఇక్కడ ATMS అందుబాటులోకి వస్తుంది.ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం, పర్యవేక్షణలో ఉండనుంది. ఇప్పటికే .. నాలుగు నుంచి ఆరు వరుసలుగా మార్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.NH-44 పరిధిలోని నాగ్‌పూర్-హైదరాబాద్-బెంగళూరు మార్గంతో పాటు ఖమ్మం-దేవరపల్లి రహదారిలోనూ ఈ టెక్నాలజీని అమలు చేయడానికి NHAI సిద్ధమవుతోంది.NHAI, మోర్త్ వర్గాలు భవిష్యత్తులో మంజూరు చేసే అన్ని కొత్త జాతీయ రహదారుల్లో ఇదే సాంకేతికతను ఉపయోగిస్తామని స్పష్టం చేశాయి.ఏఐ పర్యవేక్షణ..ఏటీఎంఎస్ వ్యవస్థలో భాగంగా డిజిటల్ హైవేలపై 360 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కృత్రిమ మేధ సాయంతో ఈ కెమెరాలు నిరంతర నిఘా ఉంచుతాయి. సీటుబెల్ట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, పరిమితికి మించి వేగం వంటి ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘన వివరాలు ఏఐ ద్వారా తక్షణమే రికార్డు అవుతాయి. ఈ సమాచారం కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరగానే నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే జరిమానా విధిస్తారు. ఇవే కాక, ట్రాఫిక్ పర్యవేక్షణ, వాహన వేగం ట్రాకింగ్‌తో పాటు, రోడ్ల పక్కన ఏర్పాటు చేసే సందేశ సైన్‌బోర్డుల ద్వారా ప్రమాద వివరాలు, పొగమంచు, జంతువుల సంచారం వంటి అత్యవసర సమాచారాన్ని కూడా కృత్రిమ మేధ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఈ సమగ్ర వ్యవస్థ ద్వారా జాతీయ రహదారులపై సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.