తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణను వర్షాలు వీడటం లేదు. కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావం ప్రస్తుతం తగ్గిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే.. ఈ ఉపరితల ద్రోణి బలహీనపడినప్పటికీ.. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలోని కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా యాదాద్రి - భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు నేడు విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.హైదరాబాద్‌ నగరంలోనూ నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉదయం పొడి వాతావరణం ఉంటుందని.. మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తాయన్నారు. ప్రధానంగా తూర్పు హైదరాబాద్ ప్రాంతాంలో తీవ్ర వర్షాలు ఉంటాయన్నారు. కాప్రా, బోడుప్పల్, కీసర, దమ్మాయిగూడ, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, బీఎన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో నేడు చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఖైరతాబాద్, షేక్‌పేట్, టోలిచౌకి, గోల్కొండ, మెహదీపట్నం, నాంపల్లి, చార్మినార్, బహదూర్‌పురా, కిషన్‌బాగ్, రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, ఆల్వాల్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయన్నారు. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు.