ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఇవాళ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటిస్తున్నారు. అయిత జగన్‌ నర్సీపట్నం పర్యటన రోజే వైఎస్సార్‌సీపీకి షాక్ తప్పలేదు. వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ గుడబండి ఆదిలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌‌లు గుడబండి నాగేశ్వరరావు, గొలుసు నరసింహ మూర్తిలు టీడీపీలో చేరారు. వీరి వెంట మరో 200 కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి. జగన్ నర్సీపట్నం వస్తున్న రోజే వీరంతా వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. వీరందరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయమైనా శిరసావహిస్తామన్నారు చింతకాయల విజయ్. గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముందుడి కాపాడిన కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. కులాలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని.. అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉన్నామన్నారు. అందరికి సముచిత స్థానం కల్పిస్తామని.. ప్రతి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా నర్సీపట్నంలో ఎప్పుడు ఎగరాలన్నారు. వెన్నుపోటు రాజకీయాన్ని ఎప్పుడు సహించేది లేదని.. విలువలతో కూడిన నాయకులుకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అయ్యన్న పాత్రుడు.. అయ్యన్న మాటిస్తే ఎంత దూరం అయిన వెళతారన్నారు చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు. నర్సీపట్నం నియోజకవర్గం పేరు చెబితే అయ్యన్నపాత్రుడు పేరు గుర్తుకొస్తుందన్నారు. చోడవరం పక్క నియోజకవర్గమైనా.. తమకు అండగా నిలిచేది అయ్యన్న మాత్రమేనన్నారు. అయ్యన్న తనకు గురువు అని.. ఆయనకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కూటమి పాలన నచ్చి తామంతా వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరామన్నారు మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ గుడబండి ఆదిలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌‌లు గుడబండి నాగేశ్వరరావు. కొత్తగా పార్టీలో చేరిన తాము.. టీడీపీలో అందరితో కలిసి ముందుకు సాగుతామన్నారు నేతలు, కార్యకర్తలు.