గ్పూప్1 నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నియామకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ విషయంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఈనెల 15న విచారణ జరగనున్న నేపథ్యంలో తాము కలిగించుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవావల్ చేస్తూ.. వేముల అనుష్ వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. మరోసారి ఊరట..తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై మంగళవారం (అక్టోబర్ 7) కూడా సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నియమాకాలు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడే ఉంటాయన్న విషయాన్ని.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. అభ్యర్థులకు స్పష్టంగా చెప్పాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అక్టోబర్ 15న తుది విచారణ జరిగే సమయంలో.. తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. తాజాగా మళ్లీ ఇదే విషయాన్ని చెప్పింది సుప్రీం కోర్టు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. ఇదీ గ్రూప్1 నియామకాల వివాదం..గ్రూప్1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పేపర్‌ లీకుల వల్ల 2022 నుంచి నియామకాలు జరగలేదు. 2023లో ప్రభుత్వం మారిన తర్వాత 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. అదే ఏడాది అక్టోబర్ 27న మెయిన్స్ పరీక్ష జరిగింది. 2025 మార్చి 10న ఫలితాలు వెల్లడించింది ప్రభుత్వం. అయితే మూల్యాంకన సమయంలో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో నియమాకాలు ఆగిపోయాయి. ఈ వివాదం ముగిసేంతవరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టు.. కమిషన్‌ను ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 10న.. తెలంగాణ హైకోర్టు సింగ్ జడ్జ్ బెంచ్.. గ్రూప్1 పరీక్షల మార్కుల లిస్ట్, ర్యాంకింగ్ లిస్టులను రద్దు చేసింది. మాన్యువల్ పద్ధతిలో రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ పూర్తి చేసి.. ఆదేశాలు జారీ చేసిన 8 నెలల్లో నియామకాలు చేపట్టాలని చెప్పింది. లేదంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఈ సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై.. టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది.సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సెప్టెంబర్ 24 స్టే విధించింది. గ్రూప్‌-1 నియామకాలు చేపట్టుకోవచ్చని చెప్పింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25న గ్రూప్1కు ఎంపికైన వారికి ప్రభుత్వం నియామక పత్రాలు జారీ చేసింది. అయితే హైకోర్టు డివిజన్ బెంజ్ ఇచ్చిన తీర్పును పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం, గురువారం.. తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం చెప్పింది.