: పాకిస్తాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై మరోసారి భారీ బాంబు దాడి జరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు 6 నెలల కాలంలో 5 సార్లు దాడి జరగడం గమనార్హం. మంగళవారం సింధ్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లకు సరిహద్దు సమీపంలో గల సుల్తాన్‌కోట్ ప్రాంతం వద్ద క్వెట్టా వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా ఈ దాడి చోటు చేసుకుంది. రైలు పట్టాలపై అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ భారీ పేలుడు ధాటికి 6 కోచ్‌లు పట్టాలు తప్పాయని.. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక ఈ ఐఈడీ బాంబు దాడి చేసింది తామే అంటూ.. బలూచ్ వేర్పాటువాద సంస్థ అయిన బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ బాధ్యత వహించింది. ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాకిస్తాన్ సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్నందున తాము వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది ఈ రైలులో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ పేలుడు కారణంగా పలువురు సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయపడ్డారు. కానీ సరైన లెక్కలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం సాధించుకునే వరకు ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ తీవ్ర హెచ్చరికలు చేసింది.మరోవైపు.. ఈ బాంబు పేలుడు జరిగిన తర్వాత భద్రతా బలగాలు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో పలువురు గాయపడినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఎంత మంది చనిపోయారు అనేదానిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. క్వెట్టా, పెషావర్ మధ్య నడిచే ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా రెబల్ గ్రూపులు దాడులు చేస్తున్నాయి.ఈ ఏడాది మార్చి 11వ తేదీన.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును బోలాన్ ప్రాంతంలో హైజాక్ చేశారు. అందులో 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు. అయితే ఈ రైలుపై దాడి చేసిన 33 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇక సెప్టెంబర్ 24వ తేదీన బలూచిస్తాన్‌లోని మస్తుంగ్, స్పిజెండ్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో మహిళలు, పిల్లలతో సహా 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.ఆగస్ట్ 10వ తేదీన మస్తుంగ్ జిల్లాలో ఐఈడీ పేలడంతో ఆరు కోచ్‌లు పట్టాలు తప్పి నలుగురు గాయాలపాలయ్యారు. ఆగస్ట్ 7వ తేదీన సిబి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ వద్ద అమర్చిన బాంబు పేలింది. అయితే అప్పటికే ఆ స్టేషన్ నుంచి రైలు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇలా జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై బలూచ్ వేర్పాటువాద గ్రూపులు పదేపదే దాడులు చేస్తున్నారు. ఇది బలూచిస్తాన్‌లో స్థానికంగా చెలరేగుతున్న తిరుగుబాటు తీవ్రతను సూచిస్తోంది.