అంతర్జాతీయ వేదికలు, మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో పదే పదే కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్ చేతిలో తీవ్ర పరాభవానికి గురవుతూ.. ప్రపంచ దేశాల ముందు పరువు తీసుకుంటున్న తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా.. మళ్లీ మళ్లీ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి వేదికపై తీసుకురావడంతో పాక్ చేసిన అన్యాయాలను భారత్ ఎత్తిచూపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్‌కు ఈసారి భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. 'మహిళలు, శాంతి మరియు భద్రత అనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా.. పాకిస్తాన్ వైఖరిని ఖండిస్తూ.. 1971లో పేరుతో తూర్పు పాకిస్తాన్‌లో (ప్రస్తుతం బంగ్లాదేశ్) జరిపిన 4 లక్షల మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు వంటి సామూహిక నరమేధ నేరాలను భారత్ గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని.. జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని తీవ్రంగా మండిపడ్డారు.ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్న సైమా సలీమ్.. కాశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను అనుభవిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేయడంతో.. వాటికి పర్వతనేని హరీష్ ఈ కౌంటర్ ఇచ్చారు. ఏటా భారత్‌పై.. మరీ ముఖ్యంగా వారు ఆశపడే భారత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను వినడానికి దురదృష్టవశాత్తు తాము వినాల్సి వస్తోందని పేర్కొన్నారు. మహిళలు, శాంతి మరియు భద్రత అజెండాలో భారత్ అద్భుతమైన రికార్డు కలిగి ఉందని ఈ సందర్భంగా హరీష్ పర్వతనేని స్పష్టం చేశారు.1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పెరుగుతున్న డిమాండ్‌లను అణిచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం మార్చి 25వ తేదీన రాత్రి.. తూర్పు పాకిస్తాన్‌లో (బంగ్లాదేశ్) ఆపరేషన్ సెర్చ్‌లైట్‌ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ సెర్చ్‌లైట్‌లో భాగంగా ఆ ప్రాంతంలో పాక్ సైన్యం సామూహిక హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ దారుణాల్లో 4 లక్షల మందికి పైగా మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. కాశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలకు.. భారత్ ఆపరేషన్ సెర్చ్‌లైట్ నరమేధ దురాగతాలను గుర్తు చేసి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.