విజయవాడ కనకదుర్గమ్మకు వచ్చే వారం రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాభరణాలు అందనున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ వజ్రాభరణాల సంస్థ ఈ కానుకను అందజేయనున్నట్లు సమాచారం. ఈ ఆభరణాలలో ముక్కుపుడక, మంగళసూత్రాలు ఉన్నాయట.. ఇప్పటికే దుర్గగుడి అధికారుల్ని సంస్థ ప్రతినిధులు కలిసి సమాచారం ఇచ్చారట. ఈ ఆభరణాలను ఒక ప్రత్యేక వేడుకలో అందజేయడానికి ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు తమ బంధువులు, స్నేహితులతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందట. సుమారు 300 మంది ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో, ప్రణాళికలను అధికారులు వివరించనున్నారు. ప్రధాన ఆలయానికి స్వర్ణ తాపడం వంటి పనుల గురించి కూడా తెలియజేయనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. అప్పుడు ఆలయ అభివృద్ధి కోసం ఒక బృందాన్ని నియమించి, దేశవిదేశాల్లోని ప్రముఖులు, దాతలను కలిసి అమ్మవారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. అప్పట్లో కూడా పలువురు దాతలు ముందుకు వచ్చారు. ఈ ఆభరణాల కానుకతో పాటు, ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈ అంశాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల దసరా ఉత్సవాల సమయంలో.. విజయవాడ దుర్గమ్మకు ఓ భక్తుడు కానుకలు సమర్పించారు. సీఎం రాజేశ్ అనే దాత తన భార్య ప్రకృతి పేరు మీద రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు సమర్పించారు. మొత్తం 90 గ్రాముల బంగారు ఆభరణాలను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్‌లకు అందజేశారు. వీటిలో బంగారు పట్టీలు, హారం ఉన్నాయి. దాతకు ప్రత్యేక దర్శనం తర్వాత, దాతకు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం ఇచ్చారు. అంతేకాదు దసరా సమయంలో అమ్మవారికి 11 రోజుల పాటూ బంగారు ఆభరణాలతో చక్కగా అలంకరించారు. దసరా వేడుకలు ఈ ఏడాది వైభవంగా నిర్వహించారు.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.