హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు.. ఆ ఏరియాల్లో కూడా మెట్రో..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని.. రాష్ట్ర వనరులు, పెట్టుబడి అవకాశాలపై విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత నరెడ్కో (NAREDCO)పై ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. గత రెండేళ్లలో దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగా నిధులనుకి వినియోగించినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో నగరం అన్ని దిక్కులా అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌ ముఖచిత్రాన్ని మార్చేందుకు మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ నిర్మించబోయే రీజినల్‌ రింగ్‌ రోడ్డు నగరంలో గ్రామీణ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. మెట్రో వ్యవస్థ హైదరాబాద్ చుట్టూ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభించనుంది. వీటితో పాటు.. మురుగు నీటి శుద్ధి కోసం రూ. 4 వేల కోట్లతో అత్యాధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STPs) నిర్మించబోతున్నారు. , చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కొంతమందిలో ఈ కఠిన చర్యలు భయం కలిగించినా, ప్రజా ఆస్తులు రక్షించబడుతున్నాయన్న మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గంలో ఇటీవల ఎకరా భూమి రూ. 177 కోట్ల ధర పలకడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా దూసుకుపోతుందో నిరూపిస్తుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నరెడ్కో ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి.. కేవలం విల్లాలు, హై-రైజ్ భవనాల నిర్మాణం వరకే పరిమితం కాకుండా.. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. సంపద సృష్టికర్తలుగా రియల్టర్లను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని పేర్కొంటూ.. వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. చివరగా.. తమ సీఎస్‌ఆర్‌ నిధులను విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలపై అధికంగా ఖర్చు చేయాలని ఆయన ఆదేశించారు. విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 100 ప్రభుత్వ పాఠశాలలు నిర్మించడంతో పాటు.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు.