'అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేయమని హామీ ఇవ్వండి'.. భారత్‌కు చైనా కండీషన్!

Wait 5 sec.

Rare Earths: దేశాల మధ్య యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. ఆధునిక సాంకేతికతకు ముఖ్యమైన కొన్ని ఖనిజాలు ఇప్పుడు కొత్త ఆయుధాలుగా మారుతున్నాయి. వాటినే అరుదైన భూగర్భ ఖనిజాలు (Rare Earths)గా పిలుస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఫోన్లు, రక్షణ ఉత్పత్తులు, విండ్ టర్బైన్ల వంటి వాటిలో వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఉత్పత్తి, ఎగుమతిలో ప్రపంచ మార్కెట్‌ను చైనా శాసిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ మార్కెట్లో చైనా వాటనే 90 శాతంగా ఉంది. ఈ క్రమంలో ఇటీవలే రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడం గమనార్హం. దీంతో భారత్ సహా పలు దేశాల్లో ఉత్పత్తుల తయారీకి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు వచ్చాయి. భారత్‌లోని కంపెనీలకు కీలకమైన రేర్ ఎర్త్ మాగ్నెట్లను తరలించే ముందు భారత్‌ ఒక హామీ ఇవ్వాలని చైనా కోరినట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్లు దిగుమతి చేసుకున్న తర్వాత వాటిని తిరిగి అమెరికాకు ఎగుమతి చేయబోమని గ్యారెంటీ ఇవ్వాలని భారత్‌ను కోరినట్లు తెలుస్తోంది. తాము ఇచ్చిన అరుదైన భూగర్భ ఖనిజాలను స్థానిక అవసరాల కోసమే ఉపయోగించుకోవాలని, వాటిని తిరిగి అమెరికాకు మాత్రం ఎగుమతి చేయవద్దని సూచించినట్లు సమాచారం. మరోవైపు.. భారతీయ కంపెనీలు ఇప్పటికే ఎండ్ యూజర్ సర్టిఫికెట్లను చైనాకు సమర్పించాయి. పెద్ద ఎత్తున విధ్వంసాలు సృష్టించే ఎలాంటి ఆయుధాలలో ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్లను వినియోగించబోమని హామీ ఇస్తూ ఈ ఎండ్ యూజర్ సర్టిఫికెట్లను సమర్పించాయి. అయితే, భారత్ నుంచి అమెరికాకు ఈ ఖనిజాలు తరలి వెళ్లే ప్రమాదం ఉందన్న అనుమానాలతో చైనా ఈ మేరకు గ్యారెంటీ కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే, అమెరికాకు చెక్ పెట్టాలంటే తమ రేర్ ఎర్త్ మాగ్నెట్లను ఎట్టి పరిస్థితుల్లో అగ్రరాజ్యానికి చేరకుండా చేయాలని చైనా పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. వాస్సెనార్ ఒప్పందంలో భాగంగా ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ గ్యారెంటీ ఇవ్వాలని చైనా కోరినట్లు వారు తెలిపారు. అంతర్జాతీయ భద్రత కోసం 42 సభ్య దేశాల మధ్య ద్వంద్వ ఉపయోగ సాంకేతికతలు, వస్తువుల బదిలీలో పారదర్శకత, బాధ్యతలను ప్రోత్సహించేలా ఈ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందంపై చైనా సంతకం చేయలేదు. భారత్ మాత్రం సంతకం చేసింది. "భారతదేశానికి సరఫరా చేసే భారీ అరుదైన భూగర్భ ఖనిజాలను అమెరికాకు చేరకుండా చూసుకోవాలని చైనా కోరుకుంటోంది" అని ఈ విషయం తెలిసిన వ్యక్తి ఈటీతో తెలిపారు. అయితే భారత ప్రభుత్వం ఇంకా అలాంటి అభ్యర్థనకు అంగీకరించలేదని ఆయన చెప్పారు. "చైనా హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్లపై అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని, ఎటువంటి మార్గాల ద్వారా మళ్లింపు ఉండదని హామీ లేకుండా సరఫరాలను విడుదల చేయడానికి ఇష్టపడటం లేదని మాకు అవగాహన ఉంది" అని మరో వ్యక్తి తెలిపారు.