అటు కేంద్ర ప్రభుత్వంలో.. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో అగ్రతాంబూలం అందుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో.. రాష్ట్రానికి భారీగా నిధులు, పెట్టుబడులు, ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నందున.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా, ఎక్కువగా తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడత కింద రూ.410 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీరాజ్ సంస్థలకు ఈ నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లతోపాటు.. 650 మండల పరిషత్‌లు.. 13,092 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది.మరోవైపు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి.. 15వ ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబరు తొలి వారంలో విడుదల చేస్తామని ఇప్పటికే ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నిలబెట్టుకున్నారు. గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు గత నెలలోనే రిలీజ్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత నిధుల్లో భాగంగా రూ.1,120 కోట్లను విడుదల చేయడంలో తలెత్తిన తీవ్ర జాప్యాన్ని కొన్ని రోజుల క్రితమే చాలా మంది సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇదే విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చించారు. ఈ మేరకు రూ.1120 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్తులకు 20 శాతం, జిల్లా పరిషత్తులకు 10 శాతం చొప్పున రాష్ట్ర ఆర్థికశాఖ విడుదల చేసింది.