ఏపీలో వారందరి రేషన్ కార్డులు రద్దు.. ఈ రెండు తప్పులు పొరపాటున కూడా చేయొద్దు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల్ని అందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వం అనర్హుల ఏరివేతపైనా ఫోకస్ పెట్టింది. ఇటు రేషన్ తీసుకోనివారిని, ఈకేవైసీ చేసుకోనివారిని అనర్హులుగా గుర్తించి కార్డులు రద్దయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు వీరిలో కొందరికి స్మార్ట్ రేషన్ కార్డుల్ని కూడా నిలిపివేశారు. ఎవరైనా రేషన్ తీసుకోకపోయినా సరే ఆ తర్వాత వారి కార్డులు రద్దు చేస్తారు. అందుకే రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి నెలా సరుకులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 6,61,141 రేషన్ కార్డులు ఉండగా.. కేవలం 5.72 లక్షల కుటుంబాలే బియ్యం తీసుకుంటున్నాయి. దాదాపు 14 శాతం మందికి రేషన్ సరుకులు అందడం లేదు. అనర్హులను గుర్తించి.. అర్హులకు మాత్రమే రేషన్ అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-కేవైసీని తప్పనిసరి చేశాయి. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి స్మార్ట్ కార్డులను నిలిపివేయడంతో అవి రద్దయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారి వివరాలను రేషన్ డీలర్ల ద్వారా అధికారులకు తెలియజేశారు. అయినప్పటికీ, చాలామంది తమ వివరాలను నమోదు చేసుకోలేదు. దీంతో, అనర్హులుగా గుర్తించిన వారి స్మార్ట్ కార్డులను అధికారులు నిలిపివేశారు. ఈ చర్యల వల్ల రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సరుకులు అందుతాయని భావిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, కుటుంబ సభ్యుల మార్పులకు సంబంధించి ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో సుమారు 1.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై నెలాఖరులోగా కొత్త కార్డుల కోసం వచ్చిన 17 వేల దరఖాస్తులను పరిశీలించి, 14,296 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. చివరి విడతలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఈ కార్డులు అందజేయనున్నారు. ప్రస్తుతం కార్డులు సిద్ధం కావడంతో, మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాలకు తరలించారు.