తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ‘’ ఆధ్వర్యంలో ‘ఈ- అన్నదాత’ సంస్థ సహకారంతో రైతులకు విస్తృత ప్రయోజనాలను అందించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉప్పునూతల మండలం దాసర్లపల్లి గ్రామంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కో-ఆర్డినేటర్ ఫెర్రీ రాయ్, మండల ఇంచార్జి బాలస్వామి పాల్గొన్నారు. ఇది రైతులకు ఆర్థిక భద్రతను కల్పించడంతో పాటు.. వ్యవసాయ అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రారంభమైంది. రైతుల సంక్షేమానికి సరికొత్త వేదిక.. ఈ సందర్భంగా మాట్లాడిన ఫెర్రీ రాయ్.. ఈ అన్నదాత ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీతో నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. అంతేకాకుండా.. త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో ఈ-అన్నదాత క్యాంటీన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్యాంటీన్‌లలో వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు తదితర సామగ్రి లభ్యమవుతుంది. ముఖ్యంగా రైతులకు వడ్డీ లేకుండా ముద్ర రుణాలు మంజూరు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ-అన్నదాత స్మార్ట్ కార్డు కలిగి ఉన్న రైతులకు అనేక సంక్షేమ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కార్డు ద్వారా రైతులకు పూర్తి ఆర్థిక, సామాజిక భద్రతను అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కార్డు ద్వారా రూ. 10 లక్షల వరకు జీవిత బీమా, పొలంలో పనిచేసేటప్పుడు ప్రమాద బీమా కవరేజ్ అందుతుంది. రైతులకు అధిక సబ్సిడీలతో కూడిన రూ. 25 లక్షల వరకు వ్యవసాయ రుణాలు, ముద్ర రుణాల మంజూరులో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు.. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధ రైతులకు సంవత్సరానికి రూ. 10,000 చొప్పున వార్షిక పెన్షన్ అందుతుంది. మహిళా రైతులకు కూడా రూ. 6,000 వార్షిక పెన్షన్ లభిస్తుంది. వ్యవసాయానికి అవసరమైన ఇన్‌పుట్‌లు, గృహ వస్తువులపై 50 శాతం వరకు రాయితీ లభిస్తుంది. బ్లాక్ కార్డు హోల్డర్లకు రూ. 5,000 ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తారు. సబ్సిడీలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఆర్మీ క్యాంటీన్ల తరహాలో క్యాంటీన్ సౌకర్యాలు లభిస్తాయి. ఆన్‌లైన్ ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించి వైద్య సలహా తీసుకోవచ్చు. రైతులపై ఆధారపడిన నిరుద్యోగులు సంస్థలను స్థాపించి, స్వావలంబన సాధించడానికి కూడా ఈ సంస్థ సహాయం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఈ అన్నదాత క్యాంటీన్ ఇంచార్జి శ్రీకాంత్, విలేజ్ అసిస్టెంట్ సైదుబాబు తదితరులు పాల్గొన్నారు.