ఏకంగా 1.5 కిలోమీటర్లు వెనక్కు వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్రయాణికుడి కోసం, లోకో పైలట్ల సాహసం

Wait 5 sec.

పాపం రైల్లో నుంచి ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. అతడ్ని కాపాడేందుకు ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏకంగా 1.5 కిలోమీటర్ల దూరం వెనక్కి ప్రయాణించిన ఘటన చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరుకు చెందిన కమలకంటి హరిబాబు (35), మావోబాబు, వెంకటేశ్వర్లు, విమలరాజు బెంగళూరు యలహంకలో పనుల చేసేందుకు బయల్దేరారు. ఈ ముగ్గురు గుంటూరులో కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర గజ్జలకొండ దాటిన తర్వాత హరిబాబు భోజనం చేశాడు. ఆ తరువాత వాష్‌బేసిన్‌ దగ్గర చేతులు కడుక్కుని గేటు దగ్గర నిలబడ్డాడు. అదే సమయంలో రైలు కుదుపులకు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. రైల్లో నుంచి హరిబాబు కిందపడటంతో తోటి ప్రయాణికులు గమనించి వెంటనే హరిబాబు సహచరులకు సమాచారం అందించారు. అప్పటికే రైలు 1.5 కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయింది.. వెంటనే వారు చైన్ లాగడంతో రైలు ఆగింది. హరిబాబు కిందపడిపోయిన విషయాన్ని లోకో పైలట్లు తెలుసుకున్నారు. వెంటనే గుంటూరు రైల్వే అధికారుల అనుమతి తీసుకుని రైలును ఏకంగా 1.5 కిలోమీటర్లు వెనక్కి తీసుకువెళ్లారు. అక్కడ పట్టాల పక్కన పడి ఉన్న హరిబాబును గుర్తించారు. ప్రయాణికులు, అతడి సహచరులు కలిసి హరిబాబును బోగీలోకి ఎక్కించి మార్కాపురం రైల్వేస్టేషన్‌కు తరలించారు. రైలు వెళ్లే సమయానికి మార్కాపురం రైల్వేస్టేషన్‌లో 108 వాహనం సిద్ధంగా ఉంది. హరిబాబును వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. హరిబాబును కాపాడాలనే ఉద్దేశంతో రైలును ఏకంగా 1.5 కిలో మీటర్లు వెనక్కు నడిపారు. అతడ్ని ఆస్పత్రికి తరలించగలిగారు.. కానీ దురదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఉపాధి కోసం బెంగళూరు వెళుతూ ఇలా హరిబాబు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైలు ప్రయాణాలు చేసే సమయంలో ప్రయాణికులు బోగీ గేటు దగ్గర నిలబడకూడదు.. ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు రైల్వే అధికారులు.