భారత్‌దే ఆసియాకప్ 2025 టైటిల్.. కానీ: టీమిండియా మాజీ క్రికెటర్‌

Wait 5 sec.

ఆసియాకప్ 2025కి సమయం ఆసన్నమైంది. మరో ఆరు రోజుల్లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో విజేత ఎవరో సెప్టెంబర్ 28 రోజు తేలిపోనుంది. ఎందుకంటే అదే రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ ఈవెంట్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చాలా మంది విశ్లేషకులు టీమిండియానే టైటిల్ గెలుచుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న భారత్.. టైటిల్‌ను డిఫెండ్ చేసుకుంటుందని జోస్యం చెబుతున్నారు.టీమిండియా ఆసియాకప్ 2025లో విజేతగా నిలుస్తుందని అంచనా వేసే వారి జాబితాలో భారత మాజీ క్రికెటర్‌ మదన్ లాల్ కూడా చేరిపోయారు. భారత్ జట్టు బలంగా ఉండటమే అందుకు కారణమని చెప్పుకొచ్చాడు. అయితే భారత్ టైటిల్ గెలవాలంటే తుది జట్టులో కుల్‌దీప్ యాదవ్ కచ్చితంగా ఉండాలని వ్యాఖ్యానించాడు.“టీమిండియా జట్టులో మంచి ఆటగాళ్లు ఉండటంతో ఆసియాకప్‌లో భారత్‌ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్‌లో అనూహ్యమైనది. దీనికి తోడు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ లాంటి జట్లు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్ జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. టీ20లలో ఆ జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. పాకిస్థాన్ విషయానికి వస్తే.. ఆ జట్టు ఫామ్‌లో లేనప్పటికీ.. తక్కువ అంచనా వేయలేం. తమదైన రోజున ఆ జట్టు ఎలాంటి టీమ్‌ను అయినా ఓడిస్తుంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గట్టి పోటీనివ్వగలవు. కానీ కుల్‌దీప్ యాదవ్‌ను భారత తుది జట్టులోకి తీసుకోవాలి. టీ20 క్రికెట్‌లో అతడి శైలి భిన్నంగా ఉంటుంది. అతడు జట్టులో ఉంటే మనదే విజయం. యూఏఈ పిచ్‌లపై ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది” అని మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఆసియాకప్ 2025లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. 14వ తేదీన పాక్‌తో ఢీకొడుతుంది. 19వ తేదీన ఒమన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సూపర్‌-4 మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.