దేశాన్ని ప్రధానంగా పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఒకటి నిరుద్యోగం.. అఖండ భారతావనిలో ఏటా లక్షల మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్తుంటే.. మరికొంతమంది యువత ప్రభుత్వ ఉద్యోగాల సాధనే ధ్యేయంగా ఏళ్లకు ఏళ్లు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. సన్నద్ధత ఫలించి, అదృష్టం వరించేది కొంతమందికి అయితే.. మరికొంతమంది నిరుద్యోగులుగా మారుతున్న పరిస్థితి. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం కూడా ఖర్చుతో కూడిన ప్రక్రియే. పరీక్షకు దరఖాస్తు చేయడం మొదలుకొని, పరీక్షల సన్నద్ధతకు కావాల్సిన ట్రైనింగ్, మెటీరియల్ ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం. అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ అందించనున్నారు. అలాగే కావాల్సిన మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందించేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. గుంటూరు లక్ష్మీపురం ఎన్‌ఆర్‌ఐ కాలేజీ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రం వివరాలను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా. అయితే సరైన ట్రైనింగ్ లేకపోవడంతో యువత వాటిని వినియోగించుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ యువతకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల సరళి, సిలబస్‌ మీద అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. మరోవైపు మన యువత పోలీస్ ఉద్యోగాల మీదే ఎక్కువగా దృష్టిపెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అయితే వీటితో పాటుగా డిఫెన్స్, బ్యాంకింగ్ రంగాలు, రెవెన్యూ, సాంకేతిక రంగాల్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాటిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారికి వేర్వేరుగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అర్హత పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఎంపిక చేసిన వారికి ఆరు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లావాసులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సరళిపై అవగాహన కల్పిస్తారు. ఏయే సబ్జెక్టులు ఉంటాయనే వివరాలతో పాటుగా, ప్రాక్టీస్ టెస్టులు, మోడల్ పేపర్లు వంటవి అందిస్తూ ట్రైనింగ్ ఇస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. త్వరలోనే విజయవాడలోనూ ఈ తరహా ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.