అమెరికాకు అధికంగా వస్తువులను ఎగుమతి చేస్తున్న భారత్.. అమెరికా వస్తువులను తక్కువగా దిగుమతి చేసుకుంటోందని.. అదే సమయంలో ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకు భారీగా ముడి చమురును కొనుగోలు చేస్తోందని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మన దేశంపై గత కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై మొదట 25 శాతం.. ఆ తర్వాత అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడంతో మొత్తం సుంకాలు 50 శాతానికి చేరుకున్నాయి. దీనిపై భారత్‌ సహా పలు దేశాలు తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు కూడా భారత్‌పై విధించిన టారిఫ్‌లను తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత్‌పై విధించిన భారీ సుంకాల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ ట్రంప్‌ వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ అమెరికా విశ్లేషకుడు, న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ప్రైస్.. సుంకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలను వెంటనే తొలగించాలని.. ఈ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని ఎడ్వర్డ్ ప్రైస్ డిమాండ్ చేశారు. తాజాగా ఓ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రొఫెసర్ ఎడ్వర్ట్ ప్రైస్.. భారత్-అమెరికా సంబంధాలు చాలా కీలకమని పేర్కొన్నారు. 21వ శతాబ్దం భారత్‌దేనని.. ఈ నేపథ్యంలోనే భారత్-అమెరికా మధ్య బంధాలు అత్యంత ఆవశ్యకమని అభివర్ణించారు. చైనా, రష్యాలను అమెరికా ఎదుర్కొంటున్న వేళ.. భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు విధించడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌పై అమెరికా వేసిన 50 శాతం సుంకాలను.. సున్నాకు తగ్గించి.. మోదీకి క్షమాపణ చెప్పాలని ఎడ్వర్డ్ ప్రైస్ సూచించారు.ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎడ్వర్డ్ ప్రైస్ ప్రశంసలు కురిపించారు. ట్రంప్ సుంకాల వేళ.. దానికి మోదీ వ్యవహరిస్తున్న వ్యూహాత్మక స్వతంత్ర విధానాన్ని ప్రశంసించారు. ఇతర దేశాల సంబంధాలు, అమెరికా సుంకాల విషయంలో నరేంద్ర మోదీ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ సుంకాల వేళ.. భారత్‌కు వేరే మార్గాలు ఉన్నాయని తనతోపాటు అమెరికన్లకు మోదీ గుర్తు చేస్తున్నారని తెలిపారు. అదే సమయంలో చైనా, రష్యాలతో భారత్ పూర్తి స్థాయిలో ఒక కూటమిలో చేరడం లేదని.. అందుకే బీజింగ్‌లో జరిగిన సైనిక పరేడ్‌కు మోదీ హాజరు కాలేదని ఎడ్వర్డ్ ప్రైస్ గుర్తు చేశారు.ఈ సందర్భంగా.. భారత్ ఒక స్వతంత్ర దేశమని.. ఎలాంటి ఇతర బయటి శక్తులతో శాశ్వతంగా కలవదని ప్రైస్ పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. చైనాతో కలిసి ఉన్నప్పటికీ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటోందని తెలిపారు. మరోవైపు.. చైనాను ఎదుర్కొనే విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. మరోవైపు.. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్.. ట్రంప్‌పై చేసిన ఆరోపణలను ఎడ్వర్డ్ ప్రైస్ సమర్థించారు. ట్రంప్ తన కుటుంబ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని జేక్ సులివాన్ అనుమానాలు వ్యక్తం చేయగా.. వాటిని ఎడ్వర్డ్ ప్రైస్ అంగీకరించారు. ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వారికి.. సొంత ఆర్థిక ప్రయోజనాలు ఉండకూడదని.. ఈ విషయంలో ట్రంప్ వైఖరి సంప్రదాయాలకు భిన్నంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ట్రంప్ ఆర్థిక ప్రయోజనాలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అనేది నిర్ధారించడం కష్టమేనని ప్రైస్ వెల్లడించారు.