భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యాన్ని తన గాత్రంతో దశాబ్దాల పాటు ఏలిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ కేరళ గడ్డపై కొలువుదీరింది. పాలక్కాడ్‌లోని వీటీ భట్ట తిరిప్పాడ్‌ కల్చరల్‌ సెంటర్‌లో దివంగత ఎస్పీబీ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. సంగీతానికి భాషా భేదం లేదని, కళాకారుడు ఎక్కడి వాడైనా ఆయన ప్రతిభ విశ్వజనీనమని కేరళ ప్రజలు నిరూపించారు. బాలు పట్ల తమకున్న అచంచలమైన ప్రేమను ఈ విగ్రహావిష్కరణ ద్వారా చాటుకున్నారు. ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్‌ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.కేరళలో ఘనంగా జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన తనయుడు ఎస్పీ చరణ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సింగర్ మనో, చిత్ర, హరిహరన్, సుజాత మోహన్, ఉన్ని మీనన్, విజయ్ ఏసుదాస్, శ్రీనివాస్, మధు బాలకృష్ణన్, అఫ్సల్ ఇస్మాయిల్, జ్యోత్స్న, బిజు నారాయణన్, రిమి టామీ, సితార కృష్ణకుమార్, స్టీఫెన్ దేవస్సీ తో సహా పలువురు గాయనీ గాయకులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఎస్పీబీకి సంగీత నివాళి ఇచ్చారు.గతంలో ఎస్పీబీ విగ్రహ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడంతో, ప్రాంతీయ విభేదాలు తెరపైకి వచ్చి గొడవలు జరిగాయి. ఆంధ్రా, తెలంగాణ అనే సెంటిమెంట్ల మధ్య ఒక మహోన్నత కళాకారుడికి దక్కాల్సిన గౌరవం వివాదాల్లో చిక్కుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు పరభాషా రాష్ట్రమైన కేరళలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడం దిగ్గజ గాయకుడికి దక్కిన నిజమైన నివాళి అని సంగీత ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక సంగీత విజ్ఞాన సర్వస్వం. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన ఘనత ఆయనది. మలయాళంలోనూ ఎన్నో పాటలు పాడారు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, సంగీత దర్శకుడిగానూ ఆయన తన ప్రతిభ చాటుకున్నారు. సంగీత ప్రపంచంలో ఆయన ప్రస్థానం అజరామరం. కరోనా పాండమిక్ టైంలో 2020, సెప్టెంబర్ 25న ఎస్పీబీ కన్నుమూశారు. ఆయన భౌతికంగా లేకపోయినా, పాటల రూపంలో సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారు.