Crude Oil Prices:అంతర్జాతీయంగా రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. దాదాపు నెల రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ చమురు, గ్యాస్ రవాణాకు కీలకంగా ఉన్న హర్ముజ్ జలసంధి దగ్గర నౌకల్ని ఇరాన్ అడ్డుకుంటుండటంతో సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో క్రూడాయిల్ ధరలు యుద్ధం ముందటి స్థాయి నుంచి భారీగా పెరిగాయి. దీంతో చమురు కంపెనీలు.. ఇంధన ధరల్ని పెంచాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడు మరో ప్రైవేట్ రిటైలర్ అదే పని చేసింది. .. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతున్నట్లు ఏప్రిల్ 1న ప్రకటించింది. క్రూడాయిల్ ధర 100 డాలర్ల మార్కుపైన ఉన్న క్రమంలో.. ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు ధరల్ని పెంచినట్లు వెల్లడించింది. బెంగళూరులో ఈ ధరల్ని గమనిస్తే లీటరుపై పెట్రోల్ ధర రూ. 7.41 మేర పెరిగింది. ఇప్పుడు సాధారణ పెట్రోల్ ధర లీటరుకు రూ. 119.85 కు చేరగా.. పవర్ లేదా ప్రీమియం వేరియంట్ పెట్రోల్ ధర రూ. 129.85 కు ఎగబాకింది. ఈ ధరలు స్థానిక పన్నుల్ని బట్టి.. ప్రాంతాల ఆధారంగా మారుతుంటాయి. పెట్రోల్ కంటే డీజిల్ ధర మరింత ఎక్కువగా పెరిగింది. లీటరుపై ఏకంగా రూ. 25.01 పెంచేసింది. దీంతో ఇప్పుడు సాధారణ డీజిల్ వేరియంట్ ధర లీటరుకు రూ. 123.52 కు చేరగా.. ప్రీమియం వేరియంట్ ధర రూ. 133.52 కు ఎగబాకింది. షెల్ ఇండియా.. బ్రిటిష్‌కు చెందిన సంస్థ కాగా.. భారత్‌లో వందలాది రిటైల్ అవుట్‌లెట్స్ నిర్వహిస్తోంది. రిటైల్ ఫ్యుయెల్ స్టేషన్లతో పాటుగా.. ల్యూబ్రికెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, రెనివబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌ను కూడా నిర్వహిస్తోంది. అంతకుముందు మార్చి 26న దేశీయ అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ.. నయారా ఎనర్జీ కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున ధరలు పెరిగాయి. ఈ సంస్థ రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ కింద పనిచేస్తుంది. భారత్‌లో 6,967 పెట్రోల్ బంకుల్ని నిర్వహిస్తోంది. ప్రైవేట్ రిటైలర్లు ధరల్ని పెంచుతున్నా.. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మాత్రం ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరల్ని మాత్రమే సవరిస్తున్నాయి. . సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్ని మాత్రం మార్చట్లేదు. ఇటీవల కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని (SAED) రూ. 10 చొప్పున తగ్గించగా చమురు కంపెనీలపై కాస్త భారం తగ్గింది. అందుకే.. ఈ సుంకాల తగ్గింపును.. రిటైల్ వినియోగదారులకు మాత్రం వర్తింపచేయలేదు.