తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన తాజా రిపోర్టు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కాగ్ నివేదికలోని లెక్కల ప్రకారం.. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 297 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినా.. అది భారీ లోటుకు దారి తీసింది. అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని ఆశించినా.. వాస్తవంలో మాత్రం రూ. 9,420 కోట్ల భారీ రెవెన్యూ లోటు ఏర్పడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో రూ.1,865.90 కోట్ల వ్యయాన్ని రెవెన్యూ విభాగంలో చూపాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా మూలధన విభాగంలో బడ్జెట్ చేసి ఖర్చు చేసినట్లు కాగ్ గుర్తించింది. 2024-2025 లెక్కల ప్రకారం.. రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ. 1,77,224 కోట్లు కాగా.. రెవెన్యూ ఆదాయం రూ. 1,67,804 కోట్లుగా నమోదైంది. వ్యయం పెరగడంతో తెలంగాణ రూ. 9,420 కోట్ల రెవెన్యూ లోటును చవిచూసింది. అయితే అంతకుముందు ఆర్థిక ఏడాది అంటే 2023-2024లో తెలంగాణ రూ. 779 కోట్ల రెవెన్యూ మిగులును నమోదు చేయడం గమనార్హం. అయితే ఈ రెవెన్యూ లోటుకు ప్రధాన కారణం జీతాల వ్యయం అని తెలుస్తోంది. అంతకుముందు ఏడాది జీతాలు రూ. 27,883 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ. 30,189 కోట్లకు పెరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై సబ్సిడీల భారం పెరగడం.. సాధారణ సేవలు, వడ్డీ చెల్లింపులపై ఖర్చులు అధికం కావడం కూడా రెవెన్యూ లోటుకు దారితీశాయని కాగ్ అంచనా వేసింది. అయితే సామాజిక, ఆర్థిక సేవలపై చేసే వ్యయం తగ్గినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే 2024-25 ఆర్థిక ఏడాదిలో అకౌంటింగ్ వర్గీకరణలో జరిగిన పొరపాట్లను కూడా కాగ్ గుర్తించింది. గ్రాంట్లు, చిన్న పనులు, వాహనాల నిర్వహణ, ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్, కృష్ణా-గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు ఇచ్చే నిధులు వంటి రూ. 1,865.90 కోట్లను రెవెన్యూ విభాగంలో చూపాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం మూలధన విభాగంలో చూపించింది. అదే సమయంలో వాహనాలు, మెషీన్ల కొనుగోలుకు సంబంధించిన రూ. 109.88 కోట్లను మూలధన విభాగంలో చూపాల్సి ఉండగా.. వాటిని రెవెన్యూ విభాగంలో నమోదు చేశారు. ఈ తప్పుల కారణంగా కూడా లెక్కలు తారుమారైనట్లు పేర్కొంది.అంతేకాకుండా.. సింగిల్ నోడల్ ఏజెన్సీల (ఎస్ఎన్ఏ) వద్ద ఉన్న నిధులపై వచ్చిన రూ. 13.51 కోట్ల వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా వర్గీకరించలేదని కాగ్ ఆడిట్‌లో స్పష్టమైంది. ప్రాజెక్ట్ అమలు చేసే సంస్థలు ఈ మొత్తాన్ని సంబంధిత రెవెన్యూ రిసీట్స్ సెక్షన్ కింద కాకుండా.. ఇతర ఖాతాల కింద జమ చేసినట్లు గుర్తించింది. అయితే గత కొన్నేళ్లుగా లెక్కలను పరిశీలిస్తే.. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,337 కోట్ల రెవెన్యూ మిగులును తెలంగాణ నమోదు చేసింది. 2022-2023లో రూ. 5,943 కోట్లు.. 2023-2024లో రూ. 779 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో 2020-2021లో కారణంగా రూ. 22,200 కోట్ల భారీ రెవెన్యూ లోటు ఏర్పడినప్పటికీ.. ఆ తర్వాత ఏడాది 2021-2022లోనే కోలుకుని రూ. 5,943 కోట్ల రెవెన్యూ మిగులును సాధించింది.