ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది.. మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. 'ఇవాళ పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్రవడగాలులు వీస్తాయి' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే 'విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర మండలాలు.. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ సీతానగరం, పోలవరం జిల్లా ఎటపాక మండలాల్లో వడగాల్పులు వీస్తాయి' అన్నారు. 'ఐఎండీ సూచనల ప్రకారం ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కవ ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉంది' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం కూడా ఉందని.. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందంటున్నారు. మంగళవారం అత్యధికంగా నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.9 డిగ్రీలు, అనంతపురం జిల్లా భట్టువానిపల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఈ ఏడాది ఎండాకాలంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని చెబుతున్నారు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40డిగ్రీల వరకు నమోదయ్యింది.. దీంతో జనాలు భయపడుతున్నారు. అలాగే ఈ ఎండలకు తోడు వేడిగాలులు వీస్తాయంటున్నారు.. రాత్రి సమయంలోనూ వేడి వాతావరణం ఉంటుందంటున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా మార్చి నెల నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంది.. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచే సూర్యుడు భగ్గుమన్నాడు. గతేడాది ఫిబ్రవరిలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఎండల తీవ్రత దెబ్బకు జనాలు బటయటకు వెళ్లాలంటే భయడపతున్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిది అంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.