ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతలకు తీపికబురు చెప్పింది.. నేటి నుంచి ఉచిత్ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, అదే మర మగ్గాలైతే 500 యూనిట్లు చొప్పున విద్యుత్ ఉచితంగా అందిస్తారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్ష వరకు కుటుంబాలు లబ్ధిపొందుతాయి. ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రతి చేనేత కార్మికుడికి ఏటా రూ.8,640 వరకు ఆదా అవుతుందని చెబుతున్నారు. అదే మర మగ్గాలకు అయితే ఏడాదికి రూ.21,600 వరకు ఆదా అవుతుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నల కుటుంబాల ఆర్థిక భరోసా కోసం ఉచిత విద్యుత్ పథకంపై నిర్ణయం తీసుకుంది అన్నారు మంత్రి సవిత. ఈ పథకం చేనేతలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల వారి మీద ఉన్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందన్నారు.రాష్ట్రంలో లక్ష వరకు చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తే ప్రభుత్వానికి రూ.150 కోట్లు ఖర్చవుతాయని మంత్రి సవిత తెలిపారు. చేనేతలు గౌరవప్రదంగా జీవించాలని.. అందుకే వారికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నేతన్నలకు నెలకు రూ.4వేల చొప్పున పింఛన్ అందిస్తున్నామన్నారు. త్వరలో నేతనన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. చేనేత వస్ర్తాలపై ఆప్కో, చేనేత సంఘాలకు జీఎస్టీ మినహాయించాలనే ప్రతిపాదన కూడా ఉందనరి.. దీనిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని.. అందుకే ఎగ్జిబిషన్లు నిర్వహించి 40 నుంచి 50శాతం డిస్కౌంట్‌లతో వస్త్రాలను విక్రయిస్తున్నామన్నారు.చేనేతలకు కోసం ప్రత్యేకంగా క్లస్టర్లు, మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవతి తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో రూ.38.30 కోట్లతో హ్యాండ్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కాబోతోందని తెలిపారు. అలాగే మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేకంగా హ్యాండ్‌లూమ్ ప్రాజెక్ట్ వస్తోందన్నారు. పిఠాపురంలో రూ.12 కోట్లతో హ్యాండ్‌లూమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేనేతలకు అండగా నిలిచేందుకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ వేదికల ద్వారా నేరుగా విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. చేనేతలకు ఆధునిక నేత యంత్రాలు కొనుగోలు చేసేందుకు 90శాతం సబ్సిడీ, ముడిసరుకుపై రాయితీ కల్పిస్తున్నామన్నారు.