దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కలిగి ఉన్న రేషన్ కార్డులను కట్ చేసినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా పార్లమెంటులో వెల్లడించారు. దేశంలో అక్రమంగా ఉన్న రేషన్ కార్డులను తొలగించినట్లు ప్రకటించారు. మరోవైపు.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 102 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు తెలిపారు. ఇక దేశంలో ఉన్న మొత్తం 5.51 లక్షల రేషన్ షాపుల్లో లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా రేషన్ సరుకులను మరింత సులభంగా పంపిణీ చేసేందుకు ఆపాస్ పరికరాలను అమర్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఇలా చేయడం వల్ల రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అక్రమాలు చేయకుండా పోయిందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన డేటాబేస్‌ను ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో లింక్ చేసేందుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్రమంత్రి జయంతిభాయ్ బాంభానియా స్పష్టం చేశారు. అనర్హులకు ఉన్న రేషన్ కార్డుల తొలగింపులో భాగంగా దేశవ్యాప్తంగా 41.41 లక్షల రేషన్ కార్డులను తొలగించినట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే.. ఆదాయపు పన్ను శాఖ, రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జీఎస్టీ సమాచారం ఆధారంగా అక్రమ రేషన్ కార్డులను తొలగించినట్లు వెల్లడించారు. అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో 102 రేషన్ కార్డులను తొలగించగా.. అత్యధికంగా రాజస్థాన్‌లో ఏకంగా 6 లక్షలకు పైగా రేషన్ కార్డులను కట్ చేశారు.తెలంగాణలో పెరిగిన రేషన్ కార్డులుతెలంగాణలో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డుల కంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 17,348 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా నెలకు 1.05 కోట్ల కార్డు దారులకు రేషన్ సరుకులు పంపిణీ జరుగుతుందని పేర్కొంటున్నాయి. అందులో 99,36,073 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉండగా.. 5,66,660 అంత్యోదయ అన్న యోజన కార్డులు.. అన్నపూర్ణ కార్డులు 5146 ఉన్నాయని వెల్లడైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలో అత్యధిక కార్డులు గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న 3 జిల్లాల్లో ఉన్నట్లు అధికారుల లెక్కలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో 936 రేషన్ షాపులు ఉండగా.. 8.39 లక్షల రేషన్ కార్డులు.. రంగారెడ్డి జిల్లాలోని 588 రేషన్ షాపుల పరిధిలో 6.53 లక్షల రేషన్ కార్డులు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 655 రేషన్ షాపులు ఉండగా.. 6.41 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడైంది. రాష్ట్రంలో అతి తక్కువగా ములుగు జిల్లాలో 1.02 లక్షల రేషన్ కార్డులు.. నారాయణపేట జిల్లాలో 1.69 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు.