తెలంగాణకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జంట బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు సాధించారు. రెండేళ్లుగా బెంగళూరులో కలిసి ఉంటున్నారు. లైఫ్ అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న తరుణంలో.. ఉద్యోగం కోల్పోయి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం.. అది తట్టుకోలేక భార్య సైతం భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన యువకుడిది సిద్దిపేట జిల్లా ములుగు మండలం కాగా.. యువతి కుటుంబం మేడ్చల్‌ వాసి. అయితే విదేశాల్లో ఉంటున్నట్లు తల్లిదండ్రులను నమ్మించిన అతడు.. బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులు మరింత షాక్‌కు గురయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ములుగు మండలం అన్నాసాగర్‌కు చెందిన కుంట భానుచందర్‌రెడ్డి (32) చదువు పూర్తి చేసుకుని జాబ్‌ కోసం కెనడా వెళ్లాడు. చాలా ఏళ్లు అక్కడే ఉద్యోగం చేశాడు. అయితే ఏఐ కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో.. బెంగళూరుకు వచ్చాడు. ఇక మేడ్చల్‌కు చెందిన 31 ఏళ్ల బీబీ షాజియా సిరాజ్‌, భానుచందర్ రెడ్డికి బాల్య స్నేహితురాలు. వీరిద్దరూ ముందు నుంచి ప్రేమలో ఉండగా.. భానుచందర్ రెడ్డి బెంగళూరుకు వచ్చిన తర్వాత.. అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ జంట బాగానే ఉండగా.. ఇటీవల రంజాన్ పండగ సందర్భంగా బీబీ షాజియా.. తన పుట్టింటికి వెళ్లి.. తిరిగి సోమవారం బెంగళూరుకు చేరుకుంది.ఈ క్రమంలోనే భర్త ఎంతకూ తలుపు తీయక పోవడంతో సెక్యూరిటీ సిబ్బంది సాయంతో డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. భర్త భానుచందర్ రెడ్డి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అది భరించలేని బీబీ షాజియా.. అదే అపార్ట్‌మెంట్‌లో 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. అయితే రెండేళ్ల క్రితమే కెనడా నుంచి వచ్చేసిన భానుచందర్ రెడ్డి.. తన తల్లిదండ్రుల దగ్గర మాత్రం నిజం దాచాడు. తాను ఇంకా కెనడాలో ఉంటున్నట్లుగా నమ్మించాడు. ఇప్పుడు అతడు ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసి వారు షాక్‌ కాగా.. అసలు తమ కుమారుడు బెంగళూరులో ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇన్నేళ్లు తమకు దూరంగా ఉన్న కుమారుడు.. ఇప్పుడు ప్రాణాలతోనే లేడనే వార్త విని వారు నిశ్చేష్టులయ్యారు. అయితే కెనడాలో ఉద్యోగం పోవడంతో.. భానుచందర్ రెడ్డి ఏడాది పాటు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. ఎలాగోలా బెంగళూరు వచ్చి స్థిరపడిన అతడు తన ప్రియురాలైన బీబీ షాజియాతో కలిసి ఉంటున్నాడు. అయితే భానుచందర్ రెడ్డి గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భానుచందర్‌ రెడ్డి రాసిన సూసైడ్‌ నోట్‌‌ను ఫ్లాట్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. షాజియాను ఏమీ అనొద్దని ఆ లేఖలో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యలో ఆమె తప్పు లేదని తెలిపాడు. తనకు ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే చనిపోతున్నట్లు భానుచందర్‌ రెడ్డి రాసుకొచ్చాడు. 32 ఏళ్ల వయసుకే అంతగా అనారోగ్య సమస్యలు ఏముంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. భానుచందర్ రెడ్డి ఇంకా బెంగళూరులోనే ఉంటున్నట్లు తల్లిదండ్రులను నమ్మించడం, షాజియా రంజాన్ పండుగకు ఒక్కతే వెళ్లి రావడాన్ని బట్టి.. వారిద్దరూ తాము కలిసి ఉంటున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదనే అర్థమవుతోంది.